కరోనా కొత్త వేరియంట్‌పై ఆందోళన వద్దు.., భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు

కరోనా కొత్త వేరియంట్‌పై ఆందోళన వద్దు..,  భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు
  • ‘జేఎన్‌.1’ ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చిచెప్పిన డబ్ల్యూహెచ్‌వో
  • సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన చెందొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న జేఎన్‌.1 వేరియంట్ ప్రమాదకరం కాదని చెబుతున్నారు. ఈ వేరియంట్ గురించి వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జేఎన్‌.1 గురించి నవంబర్ 21వ తేదీన డబ్ల్యూహెచ్‌వో ఓ ప్రకటన విడుదల చేసింది. ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్‌గా ఉన్న బీఏ.2.86 వేరియంట్‌లో జరిగిన మ్యుటేషన్‌ వల్ల జేఎన్‌.1 వేరియంట్ ఏర్పడిందని అందులో పేర్కొంది. ‘‘ఈ వేరియంట్‌కు వ్యాపించే గుణం మోడరేట్‌గా(మధ్యస్థం) ఉంది. మన ఒంట్లో ఉన్న యాంటీబాడీస్‌ను ఛేదించే గుణం కూడా మధ్యస్థమే. సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దీనికి లేదు’’ అని తెలిపింది.

65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లను కరోనా హైరిస్క్ గ్రూపు నుంచి మోడరేట్ రిస్క్‌‌‌‌‌‌‌‌లోకి మారుస్తూ డబ్ల్యూహెచ్‌‌‌‌‌‌‌‌వో ప్రకటన విడుదల చేసింది. ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ చేయించుకున్న పేషెంట్లు, సివియర్ ఆటోఇమ్యూన్ డిసీజ్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారిని మాత్రమే హైరిస్క్‌‌‌‌‌‌‌‌ గ్రూపుగా పేర్కొంది. వీరిలోనూ 6 శాతం మందికి మాత్రమే కరోనా సివియర్ జబ్బు కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. తక్కువ రిస్క్ గ్రూపు, మోడరేట్ రిస్క్ గ్రూపులో ఉన్న వారిలో 0.5 శాతం నుంచి 3 శాతం మందికే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్ అయ్యేంత స్థాయిలో వ్యాధి సోకే చాన్స్ ఉంటుందని తెలిపింది.

భారీగా టెస్టులు.. కేసులు తక్కువే

గతంలో కరోనా వైరస్‌‌‌‌‌‌‌‌ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియకపోయేది. దీంతో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో వాడాల్సిన మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌పై గందరగోళ పరిస్థితులు ఉండేవి. కానీ ఈ మూడేండ్లలో కరోనా వైరస్ ప్రవర్తన, అది శరీరంపై దాడి జరిపే తీరు, ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పద్ధతి, వినియోగించాల్సిన మెడిసిన్‌‌‌‌‌‌‌‌పై అనేక పరిశోధనలు జరిగాయి. వైరస్‌‌‌‌‌‌‌‌ లక్షణాలు, వినియోగించాల్సిన మెడిసిన్‌‌‌‌‌‌‌‌ వంటి సమాచారం డాక్టర్లకు అందుబాటులోకి వచ్చింది. దవాఖాన్లలో ఆక్సిజన్ నిల్వలు, మందులు తదితర అన్ని సౌకర్యాలను ప్రభుత్వాలు ముందుగానే సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనవసర ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే దవాఖాన్లను అప్రమత్తం చేశాయి. ఇన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కూడా జరగని కరోనా టెస్టులు, ఇప్పుడు వేల సంఖ్యలో చేస్తున్నారు. టెస్ట్ చేయించుకున్న ప్రతి వంద మందిలో ఒక్కరికి కూడా వైరస్ పాజిటివ్ రావడంలేదు. మన రాష్ట్రంలో శనివారం 1,322 మందికి టెస్టు చేస్తే, 12 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. 

అంత తీవ్రమేమీ కాదు

కరోనా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అంత తీవ్ర పరిస్థితులు ఏమీ లేవు. కొత్తగా వ్యాప్తిలో ఉన్న జేఎన్‌‌‌‌‌‌‌‌.1 వేరియంట్ ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ వేరియంట్ నిన్ననో మొన్ననో పుట్టిందేమీ కాదు. రెండు మూడు నెలల నుంచి మన దేశంలో, ఇతర దేశాల్లో వ్యాప్తిలో ఉంది. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణం వైరస్‌‌‌‌‌‌‌‌లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీలు జారీ చేస్తున్నది. ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకోవడంతో తప్పులేదు. మన పనులు మానుకుని ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు.
-  డాక్టర్ కిరణ్ మాదాల,
ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ