వచ్చే ఆర్నెళ్లు చిన్నారుల ప్రాణాలకు పెను ముప్పు

వచ్చే ఆర్నెళ్లు చిన్నారుల ప్రాణాలకు పెను ముప్పు
  • ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యంపై యునిసెఫ్ హెచ్చరిక

న్యూయార్క్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని యునైటెడ్ నేషన్స్ అనుబంధ సంస్థ యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ కారణంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతుండటంతో వచ్చే ఆరు నెలల్లో రోజుకు 6,000 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ప్రాణాలు కోల్పోతారని యూఎన్ చిల్డ్రన్ ఏజెన్సీ హెచ్చరించింది. మాతాశిశు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో రాబోయే ఆరు నెలల్లో సాధారణ మరణాల రేటుకు అదనంగా 12,00,000 మంది చిన్నారుల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. మరణాల రేటులో పెరుగుదల సాధారణం కంటే 44.7 శాతం అదనంగా ఉండవచ్చని, తల్లుల్లోనూ ఈ రేటు పెరగవచ్చని చెప్పింది. వైద్య సేవలు అందుబాటులో లేక కేవలం ఆరు నెలల్లో దాదాపు 56,700 ప్రసూతి మరణాలు సంభవించవచ్చునని పేర్కొంది.

‘‘కరోనా ఎఫెక్టుతో స్కూళ్లు మూసివేశారు. పిల్లల తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయారు. ఎన్నో పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్య సంక్షోభం కాస్తా పిల్లల హక్కుల సంక్షోభంగా మారుతోంది. అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రతిరోజు అదనంగా 6,000 మంది ఐదేళ్ల లోపు పిల్లలు చనిపోవచ్చు”అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ చెప్పారు. జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు చేసిన విశ్లేషణ ఆధారంగా వచ్చే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరు నెలల్లో హెల్త్ ఫెసిలిటీస్, భోజనం లేకపోవడంతోనే పిల్లల మరణాలు పెరుగుతాయని అంచనా వేశామన్నారు.
కరోనా ఎఫెక్టుతో ఉపాధి కోల్పోయిన శరణార్థులు, వలస వచ్చినవారి పిల్లలు..ఆరోగ్య సేవల కొరత, పోషకాహార లోపాల్ని ఎదుర్కొంటున్నారని, వివక్షకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంతంత మాత్రంగానే ఆర్థిక వ్యవస్థలున్న దేశాల విషయంలోని మాతాశిశువుల ఆరోగ్యంపై ప్రభావం మరింత తీవ్రంగా ఉందన్నారు.