ఐసీయూలో ఉన్న పేషెంట్ పరారీ.. పోలీసుల గాలింపు

ఐసీయూలో ఉన్న పేషెంట్ పరారీ.. పోలీసుల గాలింపు

కటక్: కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 55 ఏండ్ల వృద్ధుడు.. తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకుని పారిపోయాడు. దీనిపై హాస్పిటల్ యాజమాన్యం కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ ఘటన ఒడిశాలోని కటక్‌లో జరిగింది.

కటక్‌ జిల్లా మహాంగ ప్రాంతానికి చెందిన 55 ఏండ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబసభ్యులు.. ఆగస్టు 5న జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. మొదట జనరల్ వార్డులో చికిత్స అందిస్తున్నప్పటికీ అతడి పరిస్థితి క్షీణించడంతో ఐసీయూకి మార్చినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే బుధవారం ఉదయం అతడు బెడ్‌పై లేకపోవడంతో మంగళబాగ్ ఏరియా పోలీస్‌ స్టేషన్‌లో ఆస్పత్రి యాజమాన్యం, పేషెంట్ ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమంయలో అతడు ఎవరి కంట పడకుండా తప్పించకున్నట్టు ఫుటేజీ ఆధారంగా తేలిందని ఇన్‌స్పెక్టర్ అమితాబ్ మహాపాత్ర తెలిపారు. కటర్ సిటీతో పాటు రూరల్ ప్రాంత పోలీసులను అలెర్ట్ చేశామని, అలాగే పేషెంట్ స్వస్థలమైన మహాంగ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పారు. వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడి పేషెంట్‌ కోసం గాలింపు చేపడుతున్నామన్నారు.