లాక్‌‌డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తే వదిలిపెట్టం

లాక్‌‌డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తే వదిలిపెట్టం

హైదరాబాద్: వెస్ట్ జోన్‌‌లో లాక్‌‌డౌన్ అమలు తీరును నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. మెహిదీపట్నంతోపాటు రైతు బజార్ చెక్ పోస్ట్‌లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ..  ప్రజల సహకారంతో లాక్‌‌డౌన్ బాగా అమలవుతోందన్నారు. 99 శాతం మంది ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని చెప్పారు. కేవలం 1 శాతం మంది మాత్రమే అనవసరంగా బయటికి వస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని గుర్తించి వయోలేషన్ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.  

‘గడిచిన 15 రోజులుగా చాలా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో ఉల్లంఘన కేసులు నమోదు అవుతున్నాయి. 6 వేల నుంచి 7 వేల వాహనాలు సీజ్ అవుతున్నాయి. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలో 180 చెక్ పోస్ట్‌‌ల వద్ద 24/7 నిర్విరామంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కఠినంగా లాక్‌‌డౌన్ అమలు చేస్తున్నాం. ఎవరైనా రూల్స్ ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకుటున్నం’ అని అంజనీ కుమార్ స్పష్టం చేశారు.