తెలంగాణ ఇన్​చార్జ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్

తెలంగాణ ఇన్​చార్జ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్
  • ఇన్​చార్జ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్
  • జార్ఖండ్ గవర్నర్​కు రాష్ట్ర బాధ్యతలు
  • పుదుచ్చేరికి కూడా ఆయనే.. 
  • ఇయ్యాల రాజ్​భవన్​లో ప్రమాణస్వీకారం
  • తమిళిసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా పని చేస్తున్న ఆయనకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీపీ రాధాకృష్ణన్ సోషల్ మీడియా ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలిపారు. 

మంగళవారం అర్ధరాత్రి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ గా బుధవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ హాజరుకానున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళిసై సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటనలో ఒక పేర్కొంది. 

ఆర్ఎస్ఎస్ తో ప్రస్థానం.. 

తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 16 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జన్ సంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998,1999లో బీజేపీ ఎంపీగా గెలిచి... 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు.  నిరుడు ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. కాగా, తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్లుగా నియమితులవుతున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పని చేశారు.