
- సీపీ సాయి చైతన్య
బోధన్, వెలుగు : శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సూచించారు. మంగళవారం బోధన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. యూనిఫాం టర్న్ అవుట్, కిట్ ఆర్టికల్స్, ఫైళ్లను పరిశీలించి మాట్లాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పరిష్కారానికి ప్లాన్ సిద్ధం చేయాలని ఎస్సైలను ఆదేశించారు. సైబర్ నేరాలు, క్రైమ్స్‌పై పాఠశాలలు, కాలేజీలు, సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై విలేజ్ పోలీస్ ఆఫీసర్లు చురుగ్గా పని చేయాలన్నారు.
బోధన్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో, అక్కడి పోలీసుల సమన్వయంతో ఇరు వైపులా నిఘా వ్యవస్థ పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రధాన కూడళ్లలో నిఘా పెంచి, రోడ్డు ప్రమాదాలు తగ్గేలా చూడాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్, గేమ్స్ అరికట్టాలన్నారు.
పోలీసులు ఆదర్శంగా ఉండాలి..
పోలీసులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, పట్టణ సీఐ వెంకట నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, ఎడపల్లి, రెంజల్ ఎస్సైలు జె. మచ్ఛేందర్, రమ, చంద్రమోహన్, పోలీసులు పాల్గొన్నారు.