ఎంపీ ఎలక్షన్లలో ..లెఫ్ట్ పార్టీల చెరోదారి

ఎంపీ ఎలక్షన్లలో ..లెఫ్ట్ పార్టీల చెరోదారి

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎలక్షన్లలోనూ  లెఫ్ట్ పార్టీలు చెరోదారి చూసుకోనున్నాయి. కాంగ్రెస్​తోనే కలిసి పోవాలని సీపీఐ భావిస్తుండగా, ఒంటరిగా పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించుకున్నది. పొత్తుల కోసం సీపీఐ ప్రయత్నం చేసినా.. సీటు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ లో కనిపించడంలేదు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ కనీసం చర్చలు కూడా జరపలేదు. ఢిల్లీ స్థాయిలో సీపీఐ నేతలు ఒక సీటు కోసం ప్రయత్నం చేసినా..

ప్రస్తుతమున్న పోటీ నేపథ్యంలో ఇవ్వబోమనే సమాచారం కాంగ్రెస్ పెద్దల నుంచి అందినట్టు తెలిసింది. భారీ ఖర్చు నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేక కాంగ్రెస్ కే మద్దతివ్వాలని సీపీఐ భావిస్తోంది. ఒకటీ, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోపక్క పొత్తులపై  సీపీఎం పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఒంటరిగానే భువనగిరి స్థానం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయింది.

సీపీఐతో కలిసి పోటీ చేయాలని మొదట భావించినా.. ఆ పార్టీకి కాంగ్రెస్ తో వెళ్లాలనే ఆలోచనతో ఉండడంతో వెనక్కి తగ్గింది. ‘ఒక్క అసెంబ్లీ సీటు ఇచ్చేందుకే వెనుకాడిన కాంగ్రెస్.. ఎంపీ సీటు ఇస్తుందా? అందుకే పోటీకి ఒంటరిగానే సిద్ధమయ్యాం’ అని  సీపీఎం నేత ఒకరు చెప్పారు.