నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచేయి : దుబాస్ రాములు

నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచేయి : దుబాస్ రాములు

కోటగిరి, వెలుగు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూయించిందని సీపీఐ బాన్సువాడ నియోజకరవ్గ నాయకులు దుబాస్ రాములు విమర్శించారు. ఆదివారం కోటగిరిలో జరిగిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు వేసి, పరీక్షలు రాసిన వెంటనే నోటిఫికేషన్లు రద్దు చేయడం, పరీక్షల వాయిదాలతో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఇటీవల మరణించిన గ్రూప్ 2 అభ్యర్థి ప్రవల్లిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.  ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్లే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.

రూ.లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కోచింగ్‌లు తీసుకున్న నిరుద్యోగులు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామి బీఆర్‌‌ఎస్  ప్రభుత్వం అటకెక్కించిందని, ఈసారి అసలు ఆ ప్రస్తావనే లేదన్నారు. కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్, లీడర్లు  నల్ల గంగాధర్, భూడాల రాములు, సతీష్, నాగిరెడ్డి, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.