
తెలంగాణలో నిజాం పరిపాలన పూర్తిగా రాచరిక పద్ధతిలో జరిగేది. ఆ రోజుల్లో తెలంగాణ సంస్థానం అంటే 8 జిల్లాలు తెలంగాణ, ఐదు జిల్లాలుమహారాష్ట్ర, మూడు జిల్లాలు కర్నాటక కలుపుకొని మొత్తం 16 జిల్లాలుగా ఉండేది. నిజాంకు ప్రత్యేక సిక్కా ఉండేది. సిక్కా అంటే ప్రత్యేకమైన నాణాలు, చట్టాలు లాంటివి. పోలీసులు, న్యాయవ్యవస్థ తదితర విభాగాలు నిజాం ప్రభువు ఏర్పరచుకున్నాడు. దేశవ్యాప్తంగా బ్రిటిష్ పరిపాలన సాగుతున్న 550 సంస్థానాలలో పరిపాలన చిన్న చిన్న రాజులు, సామంతుల అధీనంలో ఉండేది.
సంస్థానాధీశులు బ్రిటిష్ వారితో ఏనాడూ రాజీ పడకుండా వారి వారి ప్రాంతాలను స్వతంత్రంగా పాలించుకున్నారు. నిజాం రాచరిక పాలనలో గ్రామాలలో సామాజిక అణచివేతలు బాగా ఉండేవి. ఎస్సీలను ఊరి బయట అంటరానివారిగా ఉంచేవారు. బీసీలని తమకు సంబంధించిన కులవృత్తివారిని వారి ఇంట్లో వెట్టి చాకిరి చేయించుకునేవారు. అయ్యా కాల్మొక్త బాంచన్ దొర అన్నా.. జమీందార్లు, జాగీర్దారు క్రూరంగా ప్రజలను చిత్రహింసలకు గురి చేసేవారు. ఎవరినడిగినా బాంచన్ దొర అని పిలిచే రోజులవి. ప్రజలను అణచివేయడమే వారి లక్ష్యంగా ఉండేది.
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కావాలి అని మార్క్సిజం, లెనినిజం పునాదుల మీద ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య ఉద్యమాల పోరాటాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రష్యాలో 1917లో అక్కడ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం దాని వెలుతురు లోనే అనేక దేశాలలో స్వాతంత్ర్య ఉద్యమాలు ఉద్భవించాయి. ఆ ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ తదితరులు పెద్ద ఎత్తున స్వాతంత్ర్యోద్యమాలు చేస్తున్న తరుణంలో తెలంగాణలో కూడా 1930లో మహాత్మా గాంధీ కాకినాడలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి తెలంగాణ నుంచి కూడా బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మగ్దమ్ మొహీనుద్దీన్ పాల్గొని స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్నారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు రాలేదు
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే నిజాం రాచరిక పాలనలో ఉన్న తెలంగాణలో స్వాతంత్ర్యం రాలేదు. అప్పటికే ఈ ప్రాంతంలో అణచివేతలు విపరీతంగా ఉన్నాయి. వెట్టిచాకిరి బానిసత్వంతో పాటు ఉర్దూ భాష అధికార భాషగా అమలు చేశారు. భాష మీద, మనుషుల మీద పెత్తనం చేశారు. ఇలాంటి తప్పనిసరి పరిస్థితులలో తిరుగుబాటు ఆరంభమైంది. 1935లో జోగిపేటలో ఆంధ్ర మహాసభ ప్రారంభమై ఆ తరువాత 1945లో భువనగిరిలో ఆంధ్ర మహాసభలో దున్నేవాడికే భూమి కావాలి. వెట్టిచాకిరీ రద్దు కావాలని పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. ‘బండెనక బండిగట్టి 16 బండ్లు కట్టి’ అని పాటలు పాడుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ పల్లె పల్లెకు సంఘాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే గ్రామ, పల్లెలలో ప్రజలు సంఘాలు పెట్టుకుని దొరలను ఎదిరించారు. 1946 జులై 4న కడివెండిలో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను ఎదిరించిన దొడ్డి కొమరయ్య తొలి అమరుడయ్యారు. షేక్ బందగిలాంటి అనేకమందిని పొట్టన పెట్టుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిజాం రాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు పెల్లుబికాయి. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రంలో ఉండేది. వారు కూడా తెలుగు ప్రజలు కాబట్టి తెలంగాణలో జరుగుతున్న సాయుధ పోరాటానికి పూర్తి సహకారం అందించారు.
సాయుధ పోరాటానికి పిలుపు
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినా అప్పటికి తెలంగాణలో నిజాం రాచరిక పాలనలో ఉండడం మూలంగా యువకులు, నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు జాతీయ జెండాను ఎగురవేస్తే కేసులుపెట్టి జైళ్లలో నిర్బంధించారు. చిత్రహింసలకు గురి చేశారు. ఈ నేపథ్యంలో నిజాంను ఎదిరించడానికి బందూకులు పట్టాలనే నిర్ణయానికి వచ్చారు. నాగపూర్లోని చాందాలో క్యాంపు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. పూర్తిస్థాయిలో కాకున్నా కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నది. సెప్టెంబర్ 11, 1947లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.
1947లో సెప్టెంబర్ 17న సాయుధ పోరాటానికి పిలుపు
ఆ పిలుపు ఉధృతమై ఊరూ వాడ ఉప్పెనై కత్తులు, ఒడిశలు, కారంపొడి, రోకలి బండలతో దొరల మెడలు వంచడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. దొరల పెత్తనంలో ఉన్న 3,000 గ్రామాలు విముక్తి చేయడమైనది. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ పోరాటానికి తలొగ్గిన జాగిర్దారులు, జమీందారులు, దొరలు నిజాంకు మొరపెట్టుకోవడంతో ఆయన కేంద్రంతో ఒప్పందం చేసుకొని 1948 సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు హైదరాబాద్కు రావడం జరిగింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజు తన సొంత రేడియోలో దేశంలో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తామని ప్రకటించుకున్నాడు. కమ్యూనిస్టులకు పేరు రాకుండా కేంద్రం సైన్యాలను పిలిపించుకొని తెలంగాణలో ఉన్న తమ ఆస్తులను కాపాడుకుంటూ విలీన ప్రక్రియ ప్రారంభించారు. పోరాటాలు కమ్యూనిస్టులు చేస్తే, భోగాలు మాత్రం బూర్జువా పార్టీలు అనుభవించాయని దీనినిబట్టి అర్థమవుతున్నది.
సాయుధ పోరాటం నాటికి పుట్టని బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందా?
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ విమోచన దినోత్సవం పేరుతో హిందూ ముస్లింల మధ్యన జరిగిన పోరాటంగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే, నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా అనేకమంది ముస్లింలు పాల్గొన్న విషయం అందరికీ విదితమే. కానీ, బీజేపీ తన మతతత్వ రాజకీయాలు చేస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నది. ఎలాంటి సంబంధం లేని బీజేపీ నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని విస్మరిస్తున్నది. అంటే..చరిత్రను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. భావితరాలకు చరిత్రను కనుమరుగు చేసే కుట్ర బీజేపీ పన్నుతోంది. ఇది బీజేపీ అరాచకానికి నిలువుటద్దం. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021లో సమైక్య దినం పేరుతో ఉత్సవాలు జరిపినా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన పేరుతో సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఉత్సవాలు జరిపినా అది కమ్యూనిస్టుల త్యాగ ఫలితం వల్లనే. తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు స్వాతంత్ర్యం సిద్ధించింది. పేరు ఏది చెప్పినా విలీనం జరిగిన మాట వాస్తవం.
విలీన దినం అధికారికంగా జరపాలి
కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయుధ పోరాటం భూమి చుట్టే జరిగిందని, కమ్యూనిస్టుల వల్లనే వచ్చిందని చెప్పడం మంచి పరిణామం. ఆనాటి సాయుధ పోరాట చిహ్నాలు, స్మృతులు ఇప్పటికీ పోరాట కేంద్రాలలో కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఏ పుట్టని అడిగినా, చెట్టుని అడిగినా ఆనాటి రక్తతర్పణం కనిపిస్తూనే ఉన్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వల్లాల అనే గ్రామంలో పదిమంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తే రజాకార్లు గుర్రాలతో తొక్కించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో స్థూపాన్ని కూడా సెప్టెంబర్ 17వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. సాయుధ పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగినది. అలాంటి పోరాటాన్ని దురుద్దేశంతో తొక్కి పట్టారు. బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం విడ్డూరంగా ఉన్నది. ఇది వారి ఆత్మహత్యా సదృశ్యమే. బీజేపీ వక్రబుద్ధిని ఖండిస్తున్నాం. కమ్యూనిస్టుల త్యాగ ఫలితం వలనే భారతదేశంలో తెలంగాణ విలీనమైనందున విలీన దినం అధికారికంగా జరపాలని పిలిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయుధ పోరాటాన్ని గుర్తించి ఆనాటి పోరాట స్మృతులను జ్ఞాపకాలను ఈనాటి తరానికి తెలియజేయడానికి గొప్ప ప్రయత్నం చేయాలి.
- చాడ వెంకట్ రెడ్డి,
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు