తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది  : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని  సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఆదివారం నల్గొండలోని మగ్దూం భవన్ నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఈనెల 11 వ తేదీ నుంచి జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దొరలు, భూస్వాముల  దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. 

సాయుధ పోరాట యోధులకు రావాల్సిన పింఛన్లను ఎత్తివేసిన హీనమైన చరిత్ర బీజేపీదని విమర్శించారు.  చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో 11 న అమరవీరుల స్తూపం వద్ద  సాయుధ పోరాటం వారోత్సవాలు  ప్రారంభిస్తామన్నారు. మాజీ ఎంపీ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి 34 వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సహాయ కార్యదర్శులు  పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగి శ్రవణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, కార్యర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య,పబ్బు వీరాస్వామి, గురిజ రామచంద్రం, బంటు వెంకటేశ్వర్లు, బోల్గురి నరసింహ, తిర్పారి వెంకటేశ్వర్లు, ఆర్ అంజ చారి తదితరులు పాల్గొన్నారు.