అందమైన అబద్దాలతో బడ్జెట్​ ను ప్రవేశపెట్టారు: సీపీఐ నారాయణ

అందమైన అబద్దాలతో బడ్జెట్​ ను ప్రవేశపెట్టారు: సీపీఐ నారాయణ

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్​ ఎన్నికల బడ్జెట్​ మాదిరిగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.  రాముడిని అడ్డం పెట్టుకొని బీజేపీ బ్లాక్​ మెయిల్​ రాజకీయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్​ ఈరోజు ( ఫిబ్రవరి 1) ప్రవేశపెట్టిన బడ్జెట్​ను అందమైన భాషతో అందమైన అబద్ధాలు చెప్పారని ఆయన అన్నారు.ఎన్నికలు  జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్‌ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.

 కేంద్ర బడ్జెట్‌లో 18 లక్షల కోట్లకు పైగా నిధులు ఇవ్వని వాటిగా చూపిస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగనున్నదని సీపీఐ నారాయణ అన్నారు. ప్రతి కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసించే రాజకీయ ప్రకటన మాదిరిగా మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగం ఉందని  విమర్శించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సాధారణ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన నిధులు ఉండేలా చూసుకోవడానికి కేవలం పరిపాలనాపరమైన కసరత్తు మాత్రమే మధ్యంతర బడ్జెట్‌ అని  అన్నారు. అంతకు మించి ఇందులో కొత్త ఏమీ లేదని పెదవి విరిచారు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యల పరిష్కారానికి ఎలాంటి బ్లూప్రింట్‌ను సమర్పించని ఈ బడ్జెట్ ప్రభుత్వానికి ఇష్టమైన పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.