వివేక్​పై ఐటీ దాడులు కక్ష సాధింపే..సీపీఐ నేత నారాయణ

వివేక్​పై ఐటీ దాడులు కక్ష సాధింపే..సీపీఐ నేత నారాయణ
  • కేసీఆర్​కు దమ్ముంటే ఓయూకు వచ్చి ఓట్లు అడగాలె 
  • విద్యార్థులు, నిరుద్యోగులు ఏకమై బీఆర్ఎస్​ను ఓడగొట్టాలని పిలుపు

సికింద్రాబాద్, వెలుగు: మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన పది రోజుల్లోనే వందల కోట్లు సంపాదించారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్యకు నిదర్శనమని చెప్పారు.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు– ప్రభుత్వ వైఫల్యాలు– రాబోయే ఎన్నికల్లో  విద్యార్థుల కర్తవ్యం’’ అనే అంశంపై గురువారం ఓయూలో విద్యార్థి సంఘాలు, రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్టిలో నారాయణ మాట్లాడారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఓట్లు అడగాలని ఆయన సవాల్ విసిరారు. ఉద్యమంలో ఉస్మానియా సహా ఇతర వర్సిటీల విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, కానీ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చారని నారాయణ మండిపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని విద్యార్థులకు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ ను గద్దె దింపాలె..  

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ఏకమై అవినీతి బీఆర్ఎస్ సర్కార్​ను గద్దె దించాలని, కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని నారాయణ కోరారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలన మాత్రమే కొనసాగిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అవినీతే ఇందుకు నిదర్శనమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో రోడ్లు వేసినా, కొత్తగా షాపింగ్ మాల్స్ కట్టినా అన్నింటిలోనూ మంత్రి కేటీఆర్​కు వాటా ఉంటుందన్నారు.  దళితులు, గిరిజనులు, ముస్లింలు, బీసీలను మోసం చేసిన బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ నెల్లి సత్య, ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవి నాయక్, పీడీఎస్​యూ ఓయూ అధ్యక్షుడు సుమంత్, ఎస్టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.