
తెలంగాణాలో ఉంటున్న 400 మంది హోమ్ గార్డులను ఏపీకి తీసుకురావాలని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హోమ్ మంత్రి అనితను కోరారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మంగళవారం ( జులై 29 ) హోమ్ మంత్రి అనితను కలిసిన ఆయన ఈమేరకు మంత్రి అనితకు వినతిపత్రం సమర్పించారు. అలాగే హోమ్ గార్డులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింప చేయాలని కోరారు రామకృష్ణ.
తెలంగాణాలో ఉంటున్న మన హోంగార్డులను కానిస్టేబుళ్ళ నియామకాల్లో పక్కన పెట్టడం వల్ల చాలా నష్టపోతున్నారని.. కుటుంబ కారణాలు, ఆరోగ్య సమస్యలు, విద్యా అవసరాలు, భద్రతా దృష్టితో హోంగార్డులు తీవ్రంగా బాధపడుతున్నారని అన్నారు రామకృష్ణ. రాష్ట్ర విభజన సమయంలో హోంగార్డుల శాశ్వత పరిష్కారం జరిగి ఉండాల్సిందని, కానీ ఇప్పటికీ వారు అనిశ్చితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణ. ఈ అంశంపై తక్షణం సమగ్ర విచారణ జరిపి, హోంగార్డుల బదిలీలకు అనుమతించాల్సిందిగా హోమ్ మంత్రి అనితను కోరారు రామకృష్ణ.
సుమారు 400 మంది హోంగార్డులు ప్రస్తుతం తెలంగాణ నుండి ఏపీలో విధులు నిర్వహిస్తున్నారని... అలాగే ఏపీ నుంచి కూడా 400 మంది హోంగార్డులు తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వీరందరిని వారివారి సొంతరాష్ట్రాలకు కేటాయించాలని కోరారు రామకృష్ణ.