వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తోనే పొత్తు : కూనంనేని సాంబశివరావు

వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తోనే పొత్తు : కూనంనేని సాంబశివరావు

యాదాద్రి భువనగిరి జిల్లా : వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తోనే కలిసి పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. పొత్తు లేకపోతే 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కూనంనేని సాంబశివరావు..రాబోయే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఉందని..భవిష్యత్తులో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎప్పుడు ప్రతిపక్షంగానే ఉండి కార్మిక కర్షకుల కోసం పోరాటం చేస్తామని వివరించారు. 

స్వాతంత్య్రం వచ్చాక భారతదేశం 125వ స్థానంలో ఉందని, ఉద్యోగ విషయంలో 107వ స్థానంలో ఉన్నదని, మోడీ మాత్రం అదానీ, అంబానీల సరసన చేరారని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. 

అమ్ముడుపోయే వారిని కొంటుండు.. లేదంటే ఈడీ కేసులు పెడుతుండు

గంటకు 1000 కోట్ల ఆదాయం ఉన్న అంబానికి ప్రతి కాంట్రాక్టు అప్పగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సామాన్యులు ఉపయోగించే ప్రతి వస్తువు ధరను పెంచిన ఘనత నరేంద్ర మోడీదే అని విమర్శించారు. లాభాల్లో ఉన్న స్టీల్ ప్యాక్టరీలను మొత్తం అమ్మేస్తున్నారని.. అలాగే  డబ్బులు ఇస్తే అమ్ముడుపోయే వారిని కొంటున్నాడు.. లేదంటే ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని కూనంనేని సాంబశివరావు చెప్పారు.