అక్రమ కేసులతో అణిచివేయాలని చూస్తే ఊరుకోం : జాన్వెస్లీ

అక్రమ కేసులతో అణిచివేయాలని చూస్తే  ఊరుకోం : జాన్వెస్లీ

మధిర, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులు గెలిచిన నేపథ్యంలో తమ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి అక్రమంగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, అక్రమ కేసులతో అణిచివేయాలని  చూస్తే ఊరుకోబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ అన్నారు.  ఇదే విషయాన్ని నిరసిస్తూ శనివారం  మ‌‌ధిర ప‌‌ట్టణంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన ఉనికి కోల్పోతుందని, తన బలం తగ్గిపోతుందని, వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పీపీఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టించి మధిర నియోజకవర్గంలో 13 మందిని జైలుకు పంపారని ఆరోపించారు.

సామినేని రామారావు హత్య జరిగిన పాతర్లపాడులో హత్యకు పాల్పడిన వారిని అరెస్ట్​ చేయకపోగా, సీపీఎం  నాయకులు, మధిర డివిజన్ కార్యదర్శి గోపాలరావు , ఎర్రుపాలెం మండల కార్యదర్శి ప్రభాకర్ పై కేసులు నమోదు చేయడం శోచనీయమన్నారు.  ఆళ్లపాడు, కొదుమూరులో జరిగిన ఘర్షణలో పీపీఎం నాయకులకు తీవ్ర గాయాలైనా వారిపైనే  హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపాలని చూడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, మధిర నియోజకవర్గ కార్యదర్శి మడుపల్లి గోపాల రావు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

పోలీసుల హై ఎలర్ట్ 

మధిర పట్టణంలో పీపీఎం  ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద, పలు కూడళ్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.