వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తం.. సీపీఎం, సీపీఐ నేతల వెల్లడి

వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తం.. సీపీఎం, సీపీఐ నేతల వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని సీపీఎం, సీపీఐ నేతలు మరోసారి స్పష్టతనిచ్చారు. అయితే, ఏఏ సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్​తో పొత్తుపై జరుగుతున్న చర్చలేననీ స్పష్టమవుతోంది. వచ్చేనెల 1న కాంగ్రెస్​ తేల్చినా, తేల్చకపోయినా.. తాము పోటీ చేసే స్థానాలను వెల్లడించాలని నిర్ణయిం చాయి. 

గురువారం హైదరాబాద్​లోని సీపీఎం స్టేట్ ఆఫీసు ఎంబీ భవన్​లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతలు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, శంకర్, జాన్ వెస్లీ, పోతినేని సుదర్శన్, హేమంత్ కుమార్ తదితరులు సమావేశమయ్యారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే స్థానాలపై చర్చించారు. ఇప్పటికైతే చెరో ఐదు స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

బీజేపీకి సహకరించే ఆలోచనలో కేసీఆర్ : తమ్మినేని

ఎంఐఎం మూడో ఫ్రంట్ ఆలోచన అంతా బీజేపీ కోసమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో ఎంఐఎం కావాలనే పోటీ చేసి ఓట్లను చీల్చిందని అన్నారు. బీజేపీకి సహకరించేలా కేసీఆర్ ఆలోచన ఉందని చెప్పారు. గతంలో ఇండియా కూటమిలో ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం ఏ కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని విమర్శంచారు. కమ్యూనిస్టులు ముందు నుంచీ బీజేపీకి వ్యతిరేకమేనని చెప్పారు. 

కాంగ్రెస్​తో పొత్తు వద్దనుకోవడం లేదు :  కూనంనేని 

కాంగ్రెస్​తో తాము పొత్తు వద్దనుకోవడం లేద నీ, కానీ ఈ అంశం చర్చకు రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ సీట్లు ఇస్తుందంటూ ఊహాగానాలు వద్దని, కలిసి మాట్లాడినప్పుడు క్లారిటీ వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎంతో కలిసి పోటీ చేస్తామని, సీట్ల విషయంలో వచ్చే నెల1న మరోసారి చర్చించి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. రాజ్యాంగ పీఠిక గుండెకాయలాంటిదని, అందులోంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.