తెలంగాణలో రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ!

తెలంగాణలో రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ!
  • రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ!
  • మహబూబాబాద్, మెదక్ నుంచి బరిలో దిగే యోచన
  • కాంగ్రెస్​తో పొత్తుపై నో క్లారిటీ
  • కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో చర్చించాకే నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రెండు లోక్​సభ స్థానాల నుంచి పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించింది. స్థానిక జిల్లా కమిటీలతో చర్చించి, త్వరలో సీట్లు ఖరారు చేయాలని డిసైడ్ అయింది. మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని ముందుగా భావించింది. అయితే, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి తక్కువ ఓట్లు సంపాదించుకునే కన్నా, తక్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ ఓట్లు రాబట్టుకోవాలని పలువురు సీపీఎం నేతలు అనుకున్నారు. ఈ క్రమంలో తొలుత మహబూబాబాద్, మెదక్ లోక్​సభ స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. సమయం, సందర్భాన్ని బట్టి తర్వాతి రెండు స్థానాల్లో పోటీ చేయాలా.. వద్దా.. అనేది డిసైడ్ కానున్నారు.

రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చ

ఈ నెల 9, 10వ తేదీల్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్​లో జరిగాయి. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల అంశంపై నేతలు చర్చించారు. మెజారిటీ సభ్యులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతిపాదించారు. అయితే, సీపీఎం జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. మరోపక్క రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం చవిచూసింది. కాంగ్రెస్​తో పొత్తుపై చర్చలు జరిగినా అడిగిన స్థానాలు ఇవ్వకపోవడంతో సీపీఎం ఒంటరిగానే పోటీ చేసింది. రెండు స్థానాలను సీపీఎం నేతలు అడిగినా.. ఒక స్థానం ఇస్తామని కాంగ్రెస్​ నేతలు స్పష్టం చేశారు. అందుకు వాళ్లు 
అంగీకరించలేదు. 

కాంగ్రెస్​తో పొత్తుపై నో క్లారిటీ

కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో చర్చించాకే నిర్ణయంఒక్కో పార్లమెంట్​ స్థానంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఎంకు కాంగ్రెస్ ఒక్క సీటూ కేటాయించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​తో పొత్తు కుదిరే ఆస్కారం ఉండదని నేతలు అంటున్నారు. కుదిరినా కాంగ్రెస్​కు మద్దతిచ్చే వరకే సీపీఎంతో ఒప్పందం ఉంటుందని భావిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున.. కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత క్లారిటీ తీసుకోవాలని చూస్తున్నారు.