కమ్యూనిస్టులతో పొత్తులపై..కాంగ్రెస్​లో నో క్లారిటీ

కమ్యూనిస్టులతో పొత్తులపై..కాంగ్రెస్​లో నో క్లారిటీ

ఖమ్మం సీటు ఇవ్వాలంటున్న సీపీఐ
నల్గొండ సీటును అడుగుతున్న సీపీఎం
పొత్తు కాకుండా మద్దతు కూడ గట్టుకునే యోచనలో కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నది. కమ్యూనిస్టులతో పొత్తుల విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ఖమ్మం లోక్​సభ సీటు ఇవ్వాలని సీపీఐ కోరుతున్నది. సీపీఎం మాత్రం ఖమ్మంతో పాటు నల్గొండ సీటు కేటాయించాలని కాంగ్రెస్​ను అడుగుతున్నది. పొత్తులపై జాతీయ పార్టీల మధ్య చర్చలు జరగాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి భేటీలు జరగలేవు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోగా.. సీపీఎం మాత్రం ఒంటరిగానే పోటీ చేసింది. కాంగ్రెస్ ఓకే అంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సీపీఎం ఆసక్తి చూపిస్తున్నది. ఇండియా కూటమిలో కాంగ్రెస్​తో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో మోదీకి చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పొత్తుల అంశం వెంటనే తేల్చాలని సీపీఐ జాతీయ నేత నారాయణ ఇప్పటికే కాంగ్రెస్​ను కోరారు. 

మెజార్టీ సీట్లపైనే కాంగ్రెస్ గురి

కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సీపీఐ, సీపీఎంలకు ఎంపీ సీట్లు ఇవ్వకుండానే వారి మద్దతు పొందే ప్రయత్నంలో ఉంది. దీనికి ఆ రెండు పార్టీలు సానుకూలంగా స్పందిస్తే.. రాష్ట్ర స్థాయిలో వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది. పైగా సీపీఐ, సీపీఎం అడుగుతున్న నల్గొండ, ఖమ్మం స్థానాలు సునాయసంగా కాంగ్రెస్ ఖాతాలో పడే చాన్స్ ఉంది. దీంతో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆ సీట్లను వామపక్షాలకు కేటాయించే అవకాశం లేదని అధికార పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా.. లేదా.. ఆ రెండు పార్టీలకు ఒకటో, రెండో సీట్లు ఇస్తారా.. లేదా.. అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతున్నది.