దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది

దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోంది

హన్మకొండ: విదేశాల్లో గాంధీ పేరుతో, దేశంలో గాడ్సే పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. హన్మకొండలో ఇవాళ ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో మతోన్మాదం పెరిగిపోతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరించి... బలపడాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో దేశంలో ఆర్ధిక సంక్షోభంలో కూరుకు పోయిందన్న ఆయన... 62 శాతం యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఫైర్ అయ్యారు. పెట్టుబడిదారులకు మాత్రమే మోడీ ప్రభుత్వంలో మేలు జరగింది తప్ప మామూలు ప్రజలకు ఒరిగిందేమీలేదని మండిపడ్డారు.

దేశ ప్రజలపై ఆర్ధిక దాడి జరుగుతోందన్న ఏచూరి... కోట్ల మందికి బతకుదెరువు లేకుండా పోతోందని ఆరోపించారు. 75 ఏళ్ళుగా రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయని, మోడీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్న ప్రతి పక్షాలపై మోడీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆయన... ఈ క్రమంలోనే ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ ప్రతి పక్షాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో వామపక్షాలను బలోపేతం చేసి... కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.