
జనగామ, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం జనగామలోని నల్లా నర్సింహులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా పేదల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, బూడిద గోపి, ఇర్రి అహల్య ఉన్నారు.