ఢిల్లీలో దీపావళి వేడుకలపై కీలక నిర్ణయం 

ఢిల్లీలో దీపావళి వేడుకలపై కీలక నిర్ణయం 

దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో దీపావళి వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో టపాసులపై గత ఏడాది విధించిన నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని నిర్ణయించింది.

ఢిల్లీలో వాయు, శబ్ద కాలుష్యాలను నివారించేందుకు అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వలు, రవాణ, క్రయ విక్రయాలు, వినియోగాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా క్రయ విక్రయాలను కూడా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. నిషేధం ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని.. వచ్చే ఏడాది 2023 జనవరి 1వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. 

నిషేధం ఉత్తర్వులు కఠినంగా అమలు చేస్తామని.. దీని కోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి గోపాల్ రాయ్ వివరించారు. గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 2022 జనవరి 1 వరకు టపాసుల క్రయ విక్రయాలతోపాటు వినియోగాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. నిషేధం ఉత్తర్వులు ఉల్లంఘించి యధావిధిగా టపాసులు పేల్చిన వారితోపాటు వారికి టపాసులు అమ్మిన వారికి జరిమానాలు విధించింది.