
దేశంలో ఎక్కువ మొత్తంలో కరోనా కేసులు పెరగడానికి కారణమైన తబ్లిగీ జమాత్ అధినాయకుడు మౌలానా సాద్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లా కాంధలాలోని అతని ఫామ్‌హౌస్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం ఆకస్మిక దాడి చేశారు. అయితే సాద్ అక్కడ లేకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవనంలో ప్రార్థనల తర్వాత సాద్ రెండుసార్లు ఫామ్ హౌస్ వెళ్లి వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఫామ్ హౌస్‌పై ఆకస్మిక దాడులు చేశారు.
కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు చేసినా అవేవీ పట్టించుకోకుండా మౌలానా సాద్ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మర్కజ్ ప్రార్థనలు, సదస్సు నిర్వహించాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు, వందలాది విదేశీయులు పాల్గొన్న ఈ సదస్సు కారణంగా దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో పోలీసులు ఆ సమావేశానికి కారణమైన మౌలానా సాద్ పై కేసు నమోదు చేశారు. తానే స్యయంగా దర్యాప్తుకు సహకరిస్తానంటూ తొలుత పోలీసులతో చెప్పి ఆ తర్వాత మాయమయ్యాడు . దీంతో పోలీసులు అతని కోసం యూపీలో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. అతని ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.