ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు: మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ ​ఆఫీసర్లు కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్  ఏహెచ్​టీయూ(యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని మిమ్స్​ డిగ్రీ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల టాస్క్ పోర్స్​ఇన్​స్పెక్టర్​ అశోక్, ఎస్సై లచ్చన్న బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియాలో వేధింపులు, పొక్సో యాక్ట్, సైబర్ క్రైమ్స్, గృహ హింస, మాదక ద్రవ్యాల వినియోగం ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్స్ 108,100,1093,181లకు ఫోన్ చేసి పోలీస్​  ఇతర శాఖల ద్వారా సేవలు పొందాలని సూచించారు. 

హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష

ఆదిలాబాద్, వెలుగు : టీఆర్ఎస్​ప్రభుత్వం హిందువులపై వివక్ష చూపుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదివారం ఆయన పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రూప్–1 పరీక్షా కేంద్రాల వద్ద మహిళల గాజులు పగలగొట్టి, తాళి బొట్టు తీయించి లోపలికి పంపించడం హిందువులను అవమానించడమేనన్నారు. పరీక్ష పేరుతో హిందువులను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే రేపు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మీటింగ్​లో జిల్లా నాయకుడు దినేశ్ మటోలియా, సుభాష్, రత్నాకర్ రెడ్డి, ముకుందరావు, సూర్య కిరణ్, బింగి వెంకన్న, నవీన్, మహేశ్ తదితరులు ఉన్నారు.

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా

నిర్మల్, వెలుగు : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. ఆదివారం డిగ్రీ కాలేజీ ప్రహరీ నిర్మాణానికి  మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన పట్టణ కేంద్రంలో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్​లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంద్రకరణ్​రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో  భవిష్యత్​లేదన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్​ను పార్టీని గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్​ లీడర్లు పాల్గొన్నారు.

ఫామ్​ ల్యాండ్​పై పెట్టుబడితో లాభాలు

మంచిర్యాల, వెలుగు: ఫామ్​ల్యాండ్​పై పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని అంజనీపుత్ర ఎస్టేట్స్​ చైర్మన్​ గుర్రాల శ్రీధర్​ అన్నారు. మంచిర్యాల హాజీపూర్​ మండలం ముల్కల్లలో 12 ఎకరాల్లో ఫామ్​ ల్యాండ్​ వెంచర్​ను త్వరలో లాంచ్​చేయనున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్​ను ఆదివారం మంచిర్యాల తిలక్​నగర్​లోని ఓ ఫంక్షన్ ​హాల్​లో రిలీజ్​ చేశారు. ఫామ్​ ల్యాండ్​లో ఎర్రచందనం, శ్రీగంధం చెట్ల పెంపకం ద్వారా 15 ఏండ్లలోనే లక్షల్లో ఆదాయం వస్తుందన్నారు. తమ సంస్థపై నమ్మకం, కస్టమర్ల ఆదరణతో ఇప్పటివరకు వందల ఎకరాల్లో ఫామ్​ ల్యాండ్​ వెంచర్లు ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్​, ఉట్నూర్​, ఆదిలాబాద్​, నిర్మల్​, గోదావరిఖని, పెద్దపల్లి, కరీంనగర్​, జగిత్యాల ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా మార్కెటింగ్​ ఏజెంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు. 

బాక్సర్లకు సర్టిఫికెట్ల అందజేత

కాగ జ్ నగర్ , వెలుగు: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ లెవెల్ లో  ప్రతిభ చూపిన కాగజ్ నగర్ బాక్సర్లకు ఆదివారం సర్టిఫికెట్లు అందించారు.  కాగజ్‌నగర్‌లోని  ముత్తు మెమోరియల్ బాక్సింగ్ క్లబ్ కు చెందిన ముగ్గురు బాక్సర్లు ఎం. సాయికుమార్, ఎన్ సుజాత, ప్రీతి లకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ అసోషియేషన్ సెక్రటరీ శేఖర్ అందజేశారు.  2021 డిసెంబరు14 నుంచి 22 వరకు పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా యూనివర్శిటీ లెవెల్ బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ చూపినందుకు ఈ సర్టిఫికేట్లను అందించామని పేర్కొన్నారు.  బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా  అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,  సభ్యులు ‌మధు, జకీర్ తదితరులు పాల్గొన్నారు. 

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

జైపూర్, వెలుగు: జైపూర్​సింగరేణి  థర్మల్​పవర్​ప్లాంట్​లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్ట్​ కార్మికుడు ఎలకపల్లి చంద్రమోహన్​  ఫ్యామిలీకి అండగా ఉంటామని బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య చెప్పారు. ఆదివారం  జైపూర్​లో బీఎంఎస్​ అనుబంధ జైపూర్​ పవర్​ప్లాంట్​ కాంట్రాక్ట్​ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య హాజరై మాట్లాడారు.  బీఎంఎస్​అనుబంధ సంఘం, కార్మికుల పోరాట ఫలితంగా సింగరేణి , పవర్​మేక్​ కంపెనీ  బాధిత కుటుంబానికి ప్రత్యేక ఎక్స్ గ్రేషియా, వర్క్ మెన్  కాంపాన్సేషన్ ​కింద రూ.50 లక్షలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఆంగీకరించాయని చెప్పారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. బీఎంఎస్ ​స్టేట్​వర్కింగ్ ​ ప్రెసిడెంట్ ​పేరం రమేశ్, జిల్లా జనరల్​ సెక్రటరీ మద్దూరి రాజు యాదవ్​, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎంప్లాయీస్ అండ్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

ప్రశాంతంగా గ్రూప్​–1 ఎగ్జామ్​

ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్​–1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్​ జిల్లాలో 84. 36 శాతం మంది ఎగ్జామ్​రాయగా.. మంచిర్యాలలో 78.54,  నిర్మల్​లో 82.90 , ఆసిఫాబాద్​లో 84. 48 శాతం మంది హాజరయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆయా సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని  తెలిపారు.  ఆదిలాబాద్​లో తాళి, గాజులతో ఎగ్జామ్​కు హాజరైన మహిళలను సెంటర్ల నిర్వాహకులు  వాటిని తీసేశాకే అనుమతించారు.    ఆదిలాబాద్​లో రిమాండ్ ఖైదీ జాదవ్ రమేశ్.. మెజిస్ట్రేట్, జైల్ సూపరింటెండెంట్ అనుమతితో పరీక్ష రాశారు.  

- నెట్​వర్క్​, వెలుగు

ఘనంగా ‘కూచిపూడి’ దినోత్సవం

ఆకట్టుకున్న  కళాకారుల ప్రదర్శన 

మందమర్రి, వెలుగు: సింగరేణి  సీఈఆర్​ క్లబ్​లో ‘ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవ’ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కూచిపూడి నాట్య గురువు వెంపటి చిన్న సత్యం జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య ప్రెసిడెంట్​ రాకం సంతోష్​ఆధ్వర్యంలో కూచిపూడి సంబురాలు జరిపారు. టీబీజీకేఎస్​ వైస్​ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్​, సీనియర్​ లీడర్​ జె.రవీందర్​ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కూచిపూడి నృత్యం మరింత విస్తరింపజేసేందుకు జిల్లా నృత్య కళా సమాఖ్య  చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. అనంతరం  జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 200 మంది  కళాకారులు,  ఇచ్చిన ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కూచిపూడి గురువులు గాజుల నర్మద, అశ్వినీ, వసుధ, ఊర్మిళ, రేఖ, అర్చన, రమేశ్ ను ఘనంగా సన్మానించారు. జిల్లా నృత్య కళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేందర్, సీనియర్ కళాకారులు   ప్రభాకర్,  మధు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.