
- మంచిర్యాల జిల్లాలో 21 రైస్ మిల్లులు బ్లాక్ లిస్టులోకి..
- ఇప్పటికే ఒక మిల్లర్‌పై కేసు పెట్టిన సివిల్ సప్లై అధికారులు
- మరో ఏడు మిల్లులను గుర్తించి తనిఖీలు చేస్తున్న అధికారులు
మంచిర్యాల, వెలుగు : ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని బియ్యం తిరిగి ఇవ్వకుండా మొండికేస్తున్న రైస్ మిల్లర్లపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. 2022–23 వానాకాలం సీజన్ సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పెండింగ్ ఉన్న మంచిర్యాల జిల్లాలోని 21 రైస్ మిల్లులను డిఫాల్ట్ లిస్టులో చేర్చారు. పెండింగ్ సీఎంఆర్‌పై 25 శాతం పెనాల్టీ, దానిపై12 శాతం ఇంట్రెస్ట్ చెల్లించాలని నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో
సదరు మిల్లర్లపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేశారు. ఇటీవలే జైపూర్ మండలంలోని శివసాయి రైస్‌మిల్లు యజమానిపై క్రిమినల్కేసు పెట్టారు. 2022–23, 2023–24 కు సంబంధించి రూ.1.29 కోట్ల సీఎంఆర్ బియ్యాన్ని సదరు రైస్‌మిల్లు యజమాని పక్కదారి పట్టించినట్టు గుర్తించిన సివిల్ సప్లై అధికారులు.. జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
7,397 మెట్రిక్ టన్నులు పెండింగ్
2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలోని 21 డిఫాల్ట్ మిల్లులు 5,918 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ఉన్నాయి. వీటికి ప్రభుత్వం 25 శాతం ఫెనాల్టీ విధించింది. దీంతో కలిపి 7,397 మెట్రిక్ టన్నుల బియ్యం డెలివరీ చేయాల్సి ఉంది. అలాగే దీనిపై 12 పర్సెంట్యాన్యువల్ ఇంట్రెస్ట్ రూ.42.48 లక్షలు చెల్లించాలి. ప్రభుత్వం కేటాయించిన వడ్లను అమ్ముకొని సీఎంఆర్ చెల్లించకుండా మొండికేస్తున్న ఏడు మిల్లులను గుర్తించి తనిఖీలు చేస్తున్నామని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) మోతీలాల్ తెలిపారు. తనిఖీలు పూర్తి కాగానే సదరు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి బ్లాక్ లిస్టులో పెడుతామని పేర్కొన్నారు.
పెనాల్టీతో కలిపి 300 టన్నులకు పైగా సీఎంఆర్పెండింగ్ఉన్న డీఫాల్ట్ మిల్లులు ఇవే...
రైస్‌మిల్లు పేరు పెండింగ్ సీఎంఆర్ 12 % ఇంట్రెస్ట్ (రూ.ల్లో)
కనకమహాలక్ష్మి రైస్‌మిల్ 870 4,99,859
లక్ష్మీనర్సింహా రైస్‌మిల్ 330 1,89,918
బాలాజీ ఆగ్రో ఇండస్ర్టీస్ 1371 7,87,591
వెంకటరమణ రైస్‌మిల్ 306 1,75,782
మల్లికార్జున ట్రేడర్స్ 740 4,25,050
మణికంఠ రైస్‌మిల్ 203 1,16,643
నీలం బ్రదర్స్ రైస్‌మిల్ 979 5,62,563
దుర్గ ఇండస్ర్టీస్ 616 3,54,214
అన్నపూర్ణ ఆగ్రో మోడ్రన్ 546 3,13,742
శ్రీవెంకటేశ్వర ఇండస్ర్టీస్ 460 2,64,627
శ్రీ వెంకటేశ్వర రైస్‌మిల్ 422 2,42,428