
వనపర్తి టౌన్, వెలుగు: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, ఎస్ఐ బాలయ్య హెచ్చరించారు. మంగళవారం వనపర్తి పట్టణంలో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజ్వల సీడ్స్, శ్రీ వాసవి సీడ్స్ , మన గ్రోమోర్ సెంటర్, రైతు సేవా ట్రేడర్స్, కిసాన్ మిత్రా సెంటర్, శ్రీ లక్ష్మీనరసింహ ట్రేడర్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విత్తనాల లైసెన్స్ లు, రిజిస్టర్లు, విత్తన నిల్వలు, ఎరువులు, పురుగుల మందులు వాటి రశీదులను పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రతీ దుకాణాదారుడు నాణ్యతమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను మాత్రమే అమ్మాలని ఆదేశించారు. కంపెనీలు ఇచ్చే కమీషన్లు, ఆఫర్లకు ఆశపడి నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, పురుగుల మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు, ఎరువులకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు.