
కోల్కతా: క్రిమినల్స్, అవినీతిపరులు ఉండాల్సింది అధికారంలో కాదు జైల్లో అని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం (ఆగస్ట్ 22) ప్రధాని మోడీ వెస్ట్ బెంగాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోల్కతాలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అధికార తృణమాల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) బెంగాల్ అభివృద్ధికి శత్రువని అభివర్ణించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని ఆపడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యమని ధ్వజమెత్తారు. టీఎంసీ హయాంలో రాష్ట్రంలో మహిళలపై దారుణాలు పెరిగాయని.. నేరాలు, అవినీతి టీఎంసీ ప్రభుత్వానికి గుర్తింపుగా మారాయని విమర్శించారు.
టీఎంసీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత వరకు బెంగాల్ అభివృద్ధి కాదని.. టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించినప్పుడే బెంగాల్ లో నిజమైన మార్పు వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన.. కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే ఆరోపణల కింద 30 రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించడానికి వీలుగా రాజ్యాంగ (130వ సవరణ) బిల్లును టీఎంసీ వ్యతిరేకించడంపైన మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
►ALSO READ | అవును.. మునీర్ చెప్పింది నిజమే: పాక్ పరువు తీసిన మంత్రి రాజ్నాథ్ సింగ్
‘‘ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి జైలు పాలైతే వారిని తొలగించడానికి చట్టపరమైన నిబంధన లేదు. జైలు లోపల నుంచే ప్రభుత్వాలను నడుపుతున్న వ్యక్తులు ఎంత సిగ్గులేనివారో చూడండి. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఒక టీఎంసీ మంత్రి ఇప్పటికీ జైలులో ఉన్నారు. అయినప్పటికీ ఆయన మంత్రి వదులుకోవడానికి ఇష్టపడలేదు’’ అని పాఠశాల నియామక కుంభకోణంలో జైలులో ఉన్న బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్ మంత్రి చంద్రనాథ్ సిన్హాను పరోక్షంగా విమర్శించారు.
అటువంటి మంత్రులు అధికారంలో కాదు.. జైలులో ఉండాలన్నారు. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన బిల్లుకు మద్దతు ఇస్తూ.. అవినీతిపరులు, క్రిమినల్స్ ఇకపై జైలు నుంచి ఆదేశాలు ఇవ్వలేరని అన్నారు. వచ్చే ఏడాది జరిగే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.