రొనాల్డోకు 50 వేల పౌండ్ల జరిమానా..రెండు మ్యాచుల నిషేధం

రొనాల్డోకు 50 వేల పౌండ్ల జరిమానా..రెండు మ్యాచుల నిషేధం

పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మాంచెస్టర్ యునైటెడ్ నుంచి ఉద్వాసనకు గురైన అతనికి ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్ అసోసియేషన్‌  భారీ జరిమానా విధించింది. అభిమాని చేతుల్లో నుంచి ఫోన్ విసిరేసిన నేరానికి రొనాల్డోకు 50 వేల పౌండ్లు ..అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 49.4 లక్షల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు..రెండు మ్యాచుల్లో ఆడకూడదని స్పష్టం చేశారు. 

కొత్త క్లబ్లో చేరిన తర్వాత అమలు..

ఏప్రిల్లో గూడిసన్ పార్కులో జరిగిన ఓ మ్యాచులో 1–0తో  యునైటెడ్ మాంచెస్టర్ ఓటమిపాలైంది. మ్యాచ్లో ఓడిపోవడంతో ఆ కోపాన్నిరొనాల్డో బాలుడిపై చూపించాడు. డ్రెస్సింగ్ రూంకు వెళ్తున్న క్రమంలో బాలుడి చేతిలో ఉన్న ఫోన్ను నెలకేసి కొట్టాడు. అంతేకాకుండా బాలుడి చేతికి గాయం అయిందని ఆమె తల్లి వెల్లడించింది. దీనిపై సెప్టెంబర్లో రొనాల్డో బాలుడిపై క్రూరంగా ప్రవర్తించాడని ఇంగ్లాండ్ ఫుట్బాల్ అసోసియేషన్కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన ఇంగ్లాండ్ ఫుట్బాల్ అసోసియేషన్..జరిమానాతో పాటు..రెండు మ్యాచుల నిషేధాన్ని విధించింది.  ప్రస్తుతం రొనాల్డో ఏ క్లబ్‌లోనూ లేకపోవడంతో అతడు కొత్త క్లబ్తో  ఒప్పందం చేసుకున్న తర్వాత ఇది ఇది అమలవుతుంది.

దురుసుగా ప్రవర్తించాడు..

మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించిందని అతడు దురుసుగా ప్రవర్తించాడని  స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్‌ తేల్చినట్లు ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. అయితే మొదట్లో తన భద్రత కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని నవంబర్‌ 8 న కమిషన్‌ ముందు హాజరై రొనాల్డో చెప్పాడు. అయితే స్వతంత్ర రెగ్యులేటరీ మాత్రం భయంతో కాకుండా ఓటమి  ఫ్రస్ట్రేషన్‌లో రొనాల్డో అలా ప్రవర్తించినట్లు  కమిషన్‌ వెల్లడించింది. ఆ తర్వాత రొనాల్డో క్షమాపణ చెప్పాడు. 

ఫిఫాకు నిషేధం వర్తించదు..

రొనాల్డోపై విధించిన రెండు మ్యాచుల నిషేధం..ఫిఫా వరల్డ్‌కప్‌కు వర్తించదు. ఇది పోర్చుగల్‌తోపాటు రొనాల్డోకు పెద్ద ఊరట. మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా పోర్చుగల్ నవంబర్ 24న తొలి మ్యాచ్ ఘనాతో ఆడబోతుంది.