న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై కమ్ముకున్న మేఘాలు

న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై కమ్ముకున్న మేఘాలు

న్యాయ వ్యవస్థ స్వతంత్రతని కాపాడే  ప్రయత్నాలలో భాగంగా సుప్రీంకోర్టు  కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2015వ సంవత్సరంలో న్యాయమూర్తుల నియామకాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన సంస్థను ఏర్పాటు  చేయాలన్న ఉద్దేశంతో  జాతీయస్థాయి నియామక  కమిషన్ (ఎన్​జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసి కొలీజియం వ్యవస్థనే కొనసాగించింది. ప్రభుత్వం న్యాయవ్యవస్థను  ప్రభావితం చేస్తున్నదని అందరూ అంటున్నారు. అలాగే  న్యాయవ్యవస్థ ఆ ఒత్తిడికి లోనవుతుందన్న ఆందోళనను కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఈ ఆందోళనలని సుప్రీంకోర్టు  సిట్టింగ్​ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్​ భుయాన్​ కూడా వ్యక్తం చేశారు.

ఒక  హైకోర్టు న్యాయమూర్తి బదిలీ ప్రభుత్వ అభ్యర్థనపై జరుగుతుందని సుప్రీంకోర్టు కొలీజియం స్వయంగా నమోదు చేసినప్పుడు అది న్యాయవ్యవస్థలోకి  ప్రభుత్వం చేసిన తీవ్రమైన జోక్యంగా అందరికీ కనిపిస్తుందని జస్టిస్​ భుయాన్​ అన్నారు. న్యాయవ్యవస్థ  స్వాతంత్ర్యానికి  అతి పెద్ద ముప్పు లోపల నుంచి (అంటే న్యాయవ్యవస్థ నుంచి) వస్తుందని చాలామంది అంటున్నారని కూడా జస్టిస్​ భుయాన్​ అన్నారు.  రాజకీయ  ప్రభావం అన్న వ్యాధిని దృష్టిలో ఉంచుకుంటే కొలీజియం వ్యవస్థ  కాలానుగుణంగా అత్యవసరంగా మారిపోయిందని కూడా ఆయన అన్నారు. 

భారత ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం స్వతంత్రమైన న్యాయవ్యవస్థ.  కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలపై రాజ్యాంగ  పరిమితులను విధిస్తూ  పౌరుల హక్కులను  పరిరక్షించే  బాధ్యత  న్యాయవ్యవస్థది. అలాంటి న్యాయవ్యవస్థపై సందేహాలు తలెత్తినప్పుడల్లా అవి కేవలం న్యాయవ్యవస్థకే  కాదు.  మొత్తం  ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాద సంకేతాలుగా మారతాయి. సుప్రీంకోర్టు  కొలీజియం  చుట్టూ  వెల్లువెత్తుతున్న పరిణామాలు ఆ ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని  జవాబుదారీతనం లేదని అనేక విమర్శలు ఉన్నాయి.  ఈ పరిస్థితుల్లో  కొలీజియం స్వతంత్రత గురించిన ఆందోళనలు సుప్రీంకోర్టు సిట్టింగ్​ జడ్జి నుంచి రావడం భయాందోళనలు కలిగిస్తున్నాయి.

న్యాయమూర్తుల బదిలీల విషయంలో  ప్రభుత్వ జోక్యం  కొలీజియం  సిఫార్సులోనే  స్పష్టంగా  కనిపిస్తోంది. ఆ విషయాన్ని పేర్కొటూ  భుయాన్​ ఆందోళన అందరినీ కలవరపెడుతోంది. న్యాయవ్యవస్థ  స్వతంత్రత గురించి  విశ్వాసం  ఉన్న వ్యక్తులకి,  అది  స్వతంత్రంగా లేదని  స్పష్టమై  భయం  కలుగజేస్తుంది. ‘స్వతంత్రతలో  ఎంతో  అస్వతంత్రత  ఉందని’  స్పష్టమవుతుంది. 

ఈ బదిలీల సిఫారసులు  కొలీజియం  మీటింగ్​లో  తీసుకుంటారు.  కొన్ని సందర్భాలలో  సర్క్యులేషన్​ ద్వారా జరుగుతాయి.  అప్పుడు  జూనియర్​ న్యాయమూర్తి  నుంచి  సీనియర్​ న్యాయమూర్తుల  వద్దకు  ఫైల్​ వెళ్లాల్సి ఉంటుంది.  కానీ, పై నుంచి  కిందకు వస్తే  స్వతంత్రంగా  అభిప్రాయాలు  వెలువరించే  పరిస్థితి ఉండదు.

జస్టిస్​ అతుల్ శ్రీధరన్ ​బదిలీ
మధ్యప్రదేశ్​  హైకోర్టు  న్యాయమూర్తి  జస్టిస్​ అతుల్​ శ్రీధరన్​ని  మొదట చత్తీస్​గఢ్​  హైకోర్టుకి  బదిలీ చేయాలని  సుప్రీంకోర్టు  కొలీజియం నిర్ణయించింది.  అయితే,  కేంద్ర  ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని పున:పరిశీలించి చివరకు  ఆయనను  అలహాబాద్​ హైకోర్టుకి  బదిలీ చేయమని  కొలీజియం సిఫారసు చేసింది.  అదేవిధంగా  ఆయనకు  బదిలీ అయింది.  

కొలీజియం  ఈ  విషయాన్ని తన  సిఫారసులో ప్రత్యేకించి పేర్కొంది. ఈ మార్పుపై  జస్టిస్ ఉజ్జల్​ భుయాన్​ బహిరంగంగా  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  హైకోర్టు  న్యాయమూర్తుల  బదిలీలు  పూర్తిగా  కొలీజియం  పరిధిలోని  అంశమని  అలాంటప్పుడు  కార్యనిర్వాహకశాఖ  జోక్యం చేసుకోవడం,  కొలీజియం దాన్ని అంగీకరించడం అత్యంత  ఆందోళనకరమని  జస్టిస్​ భుయాన్  హెచ్చరించారు. 

ఇది  భవిష్యత్తులో  ప్రభుత్వానికి  నచ్చని తీర్పులను  ఇచ్చే  న్యాయమూర్తులను  బదిలీ ద్వారా  శిక్షించే  సంప్రదాయానికి దారితీస్తుంది. ఈ బదిలీ వల్ల జస్టిస్​ అతుల్​ శ్రీధరన్​కి  అసౌకర్యంతోపాటు  నష్టం కూడా జరిగింది.  ముందు  ప్రతిపాదించినట్టు  చత్తీస్​గఢ్​ హైకోర్టుకి  బదిలీ అయి వెళ్తే  అక్కడ  ఆయన కొలీజియం సభ్యుడయ్యే అవకాశం ఉండేది.  కానీ, అలహాబాద్​కి  బదిలీ కావడం వల్ల  ఆయన  సీనియారిటీ  జాబితాలో   చాలాకిందకు  వెళ్లిపోయారు.  సాధారణంగా  పరిపాలన అవసరాల కోసం  బదిలీ  చేస్తున్నట్టు  పేర్కొంటారు.  ఈ  బదిలీలో  ఏ అవసరాలున్నాయోనన్న అనుమానాలు సహజంగానే తలెత్తుతాయి.

జస్టిస్​ మురళీధర్​ బదిలీ ఉదంతం
ఈ మధ్య జస్టిస్​ మురళీధర్​ సంపాదకత్వంలో ‘(ఇన్) కంప్లీట్​ జస్టిస్’  సుప్రీంకోర్టు 75’ అనే పుస్తకం వెలువడింది.   ఆ  పుస్తకంలో  సుప్రీంకోర్టు  పూర్వ న్యాయమూర్తి   మదన్​  బి లోకూర్​ వ్యాసంలో   న్యాయవ్యవస్థ  స్వతంత్రత గురించి  ఎన్నో  సందేహాలను  లేవనెత్తారు.  ఒక తీర్పుని  వెలువరించినందుకుగాను  ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్​ మురళీధర్​ని  బదిలీ  చేయమని  కొలీజియంకి  అభ్యర్థన  వచ్చిందని,  తాను  ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాను అని తన  అభిప్రాయాన్ని గౌరవించి అతని బదిలీని సిఫారసు చేయలేదని చెప్పారు. 

తాను  పదవీ  విరమణ చేసిన  తరువాత ప్రభుత్వం ఈ బదిలీ గురించి మళ్లీ ఒత్తిడి తెచ్చిందని, అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీ బదిలీ గురించి అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల అది విఫలం అయిందని,  ఆయన  పదవీ విరమణ  తరువాత  తీవ్ర వ్యతిరేకత  లేకపోవడం వల్ల  ఆయన  బదిలీ జరిగిందని మదన్​ లోకూర్​ తన వ్యాసంలో  పేర్కొన్నారు.

ఏకపక్షంగా జస్టిస్​ మురళీధర్​ని  బదిలీ  చేశారని  జస్టిస్​ లోకూర్​ తన వ్యాసంలో రాశారు. జస్టిస్​ మురళీధర్​ బదిలీ ఆ సమయంలో తీవ్రమైన ఆగ్రహాన్ని కలుగజేసింది. ఆ సంవత్సరం ఢిల్లీలో జరిగిన  మత హింసాకాండలో  రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై  ఎఫ్ఐఆర్​ నమోదు చేయడంలో విఫలమైనందుకు..  ఢిల్లీ  పోలీసులపై ఆయన ఘాటుగా తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సంఘటన క్రమాన్ని బట్టి ఈ బదిలీ  శిక్షార్హమైనదన్న ఊహాగానాలు ఏర్పడ్డాయి.  ఇది బహిరంగంగా  మాట్లాడే  స్వతంత్ర న్యాయమూర్తిని నిశ్శబ్దం చేసే చర్య అని చాలామంది న్యాయవాదులు, సివిల్​ సొసైటీ సభ్యులు  విమర్శించారు.

ముందున్న దారి
కొలీజియం  ఒక  నిర్ణయాన్ని ఎందుకు  తీసుకుంది.  ఎందుకు  మార్చిందన్న  విషయాల్లో  స్పష్టత అవసరం.   కార్యనిర్వాహక  ఒత్తిడి మేరకు  బదిలీలకు  సిఫారసు చేస్తే  అది  ప్రమాదకరమైన ధోరణి.  ఇదే  పరిస్థితి  కొనసాగితే ధైర్యంగా,  స్వతంత్రంగా  తీర్పులు ఇచ్చే  న్యాయమూర్తులు  కరువు అవుతారు. కొలీజియం వ్యవస్థ  సిద్ధాంత స్థాయిలో  కాకుండా ఆచరణలో  కూడా అదేవిధంగా ఉండాలి.   లేనిపక్షంలో  న్యాయమూర్తుల  బదిలీలు  న్యాయపరమైన  ప్రక్రియ  కాకుండా  రాజకీయ  నియంత్రణ  సాధనంగా మారే ప్రమాదం ఉంది.

అసౌకర్యమైన తీర్పులే కారణమా?
జస్టిస్​ శ్రీధరన్​ గతంలో ఇచ్చిన కొన్ని కీలక తీర్పులు ఈ అనుమానాలను  బలపరుస్తున్నాయి.  ఆయన  జమ్మూ కాశ్మీర్ ​ హైకోర్టులో ఉన్న సమయంలో పబ్లిక్​  సేఫ్టీ యాక్ట్​  కింద  జారీ చేసిన అనేక నిర్బంధ ఉత్తర్వులను  రద్దు చేశారు.

మధ్యప్రదేశ్​  హైకోర్టులో ‘ఆపరేషన్​ సిందూర్’ సందర్భంలో ఆర్మీ అధికారి కల్నల్​ సోఫియా  ఖురేషిపై మంత్రి విజయ్​షా చేసిన వ్యాఖ్యలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని ఆదేశించిన బెంచికి  ఆయన  నేతృత్వం వహించారు. ఇవన్నీ ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించిన తీర్పులే. 

ప్రభుత్వం అభ్యర్థన కోసం అతని బదిలీని మార్చినట్టు మాత్రమే కొలీజియం పేర్కొనడం వల్ల, న్యాయమూర్తుల బదిలీల వెనుక స్పష్టమైన  ప్రమాణాలు లేకపోవడం వల్ల ఈ బదిలీ శిక్షాత్మకమన్న అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఈ బదిలీ ప్రభావం ఇతర న్యాయమూర్తులపై ఉంటుంది. 

డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)