ఆఫీసర్ల చేతుల్లోనే యాదాద్రి!.. రిటైరై మూడేండ్లైనా సీటు వదలని ఈవో

ఆఫీసర్ల చేతుల్లోనే యాదాద్రి!.. రిటైరై మూడేండ్లైనా సీటు వదలని ఈవో
  •     ఈవో, వైటీడీఏ వైస్ చైర్మన్ పనితీరుపై విమర్శలు
  •     సామాన్యులకు నష్టం కలిగించే నిర్ణయాలు
  •     నేటికీ పత్తాలేని పాలకమండలి

యాదాద్రి, వెలుగు :  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునరుద్ధరణ సమయంలోనూ, ఆ తర్వాత   ప్రభుత్వం అనుసరించిన తీరు వల్ల  యాదగిరిగుట్ట  ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. తమ పొట్ట కొట్టవద్దని..న్యాయం చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు.  పూర్తి స్థాయి ధర్మకర్తల మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడంతో దేవస్థాన వ్యవహారాల్లో ఈవో  ఇష్టారాజ్యం కొనసాగింది.   సర్కారు మీద గుట్ట జనాల్లో  గూడు కట్టుకున్న ఆగ్రహం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఇక్కడ బీఆర్ఎస్​ కు పడ్డ ఓట్లు 26 శాతానికి  మించలేదు. 

14 ఏండ్లుగా పాలక మండలి లేదు

యాదాద్రి టెంపుల్​కు14 ఏండ్లుగా  ధర్మకర్తల మండలి లేదు. వంశపారంపర్య ధర్మకర్త సహా 9 మంది సభ్యులు ఉండాల్సిన  ధర్మకర్తల మండలి పదవీకాలం 2009లో ముగిసిపోయింది.  బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక సభ్యుల సంఖ్యను 14కు పెంచుతున్నట్టు ప్రకటించారు.   పాలకమండలి ఏర్పాటుకు  నాలుగుసార్లు నోటిఫికేషన్​ ఇచ్చినా  ఎవరినీ నియమించలేదు. దాదాపు రూ. 1200 కోట్లతో నాటి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం  పనులు చేపట్టింది.  ఈ పనుల కోసం యాదాద్రి టెంపుల్​ డెవలప్​మెంట్​ అథారిటీ (వైటీడీఏ) ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులను ఈ సంస్థే పర్యవేక్షించింది.  కొత్త  ప్రభుత్వం రావడంతో  ప్రస్తుతం పాలకమండలి ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది.  ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన వారితో పాటు  ఇతర జిల్లాల లీడర్లు కూడా  టెంపుల్​ కమిటీలో చోటు దక్కించుకునేందుకు  
ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.    

అంతా ఆమే.. 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా  తొమ్మిదేండ్లుగా గీత కొనసాగుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం,  విస్తరణ పనులకు బీఆర్ఎస్​ ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పటి నుంచి ఆమెనే ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. గీత రిటైర్మెంట్ గడువు ముగిసి  మూడేండ్లయినా ఇక్కడే తిష్ట వేశారు.   సర్కారు పెద్దలతో ఉన్న సంబంధాల వల్ల  అప్పటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను సైతం ఈవో గీత పట్టించుకోలేదన్న ప్రచారం జరిగింది.  ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఈవోను  తొలగించాలన్న డిమాండ్ చాలాకాలంగా​ వినిసిస్తోంది. 

సామాన్యుల కష్టాలు

పునర్నిర్మాణంలో స్థానికులకు నష్టం జరగకుండా చూడడంలో వైటీడీఏ వైస్​ చైర్మన్​ కిషన్​రావు, టెంపుల్​ ఈవో గీత విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. రోడ్ల విస్తరణ, రింగ్​రోడ్డుతో  స్థానికులు ఇండ్లు, షాపులు కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా కుదేలయ్యారు. షాపులు కోల్పోయిన వారికి తిరిగి నిర్మించి ఇస్తామని చెప్పినా ఇప్పటికీ  ఇవ్వలేదు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో వందలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉపాధి  కోల్పోయాయి. ఇక ఆలయ నిర్మాణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తప్ప సామాన్య భక్తుల అవసరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. గుట్ట మీదగానీ, గుట్ట కిందగానీ భక్తులకు కనీస వసతులు కల్పించలేదు. ముందు కోనేటిలో స్నానం చేసి దేవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ, గుట్టపైన కోనేరు లేకపోవడం సమస్యగా మారింది. ఇక గుట్ట మీద నిలువ నీడలేకపోవడంతో నర్సన్నను దర్శించుకోవాలంటే ఎండ, వాన, చలిని భరించాల్సి వస్తోంది. కొండపైన టాయిలెట్లు కూడా  లేకపోవడంతో భక్తులు పడ్తున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు మొదటి ఘాట్​రోడ్డు నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఎగ్జిట్​ఘాట్​ రోడ్డు నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కల్యాణమండపం, సంగీత నిలయం నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి.  అన్నదానసత్రం పనులు నత్తనడకన సాగుతుండడంతో  దీక్షాపరుల మండపంలో భక్తులకు భోజనం పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం నుంచి ఫండ్స్​ వస్తేనే ఈ పెండింగ్​ పనులు పూర్తికానున్నాయి.
 
బీఆర్ఎస్​కు యాదాద్రి ఓటర్ల షాక్

ఆలయ పునర్నిర్మాణం వల్ల తమకు నష్టం జరిగిందని ఆగ్రహంతో ఉన్న  యాదగిరిగుట్ట ఓటర్లు బీఆర్​ఎస్​కు  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాక్​ ఇచ్చారు. ఊళ్లో 13, 465 ఓటర్లు ఉండగా 11, 222 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్​అభ్యర్థి బీర్ల అయిలయ్యకు 7,394 (65.88 శాతం) ఓట్లు వేయగా,  కేవలం 3,012 (26.84 శాతం) మంది మాత్రమే బీఆర్​ఎస్ అభ్యర్థికి  ఓటేశారు.  బీజేపీకి  మరో 524 (4.66 శాతం) ఓట్లు పడ్డాయి.

ఉపాధి కోల్పోయాం 

కొండపైకి ఆటోలను నిషేధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఆటో  డ్రైవర్ల కుటుంబాలను  రోడ్డున పడేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆటోలను కొండపైకి అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో ఆ పార్టీకి మద్దతిచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం.
- గడ్డమీది దేవేందర్ గౌడ్, ఆటో డ్రైవర్

షాపుల కేటాయింపులో అన్యాయం

యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా వరకు రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయిన 139 మందికి లక్ష్మిపుష్కరిణి సమీపంలో షాపులు నిర్మిస్తున్నారు. పూర్తయిన  షాపుల కేటాయింపునకు జూలై 14న తీసిన డ్రాలో అవకతవకలు జరిగాయి. బీఆర్​ఎస్​కు సంబంధించిన వ్యక్తులకు ప్రైమ్ ప్లేస్ లో షాపులు వచ్చేలా చూసుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయని నవంబర్ 2న షాపులకు సంబంధించిన ప్రొవిజినల్ సర్టిఫికెట్లను ఇచ్చినా.. పట్టాలు మాత్రం ఇవ్వలేదు. షాపుల నిర్మాణం పూర్తిచేసి మరోసారి డ్రా ప్రక్రియ చేపట్టాలి.
- గుండ్లపల్లి శ్రీరాం