కోర్టులో కేసులుండగానే సెలెక్టెడ్ లిస్టు

కోర్టులో కేసులుండగానే సెలెక్టెడ్ లిస్టు

హైదరాబాద్, వెలుగుగురుకుల ప్రిన్సిపల్​ పోస్టుల భర్తీ విషయంలో టీఎస్​పీఎస్సీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. రిక్రూట్​మెంట్ ఎలిజిబిలిటీ అంశాలపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే, ఫైనల్ సెలెక్టెడ్​ లిస్టును అధికారులు ప్రకటించారు. దీంతో కోర్టులో కేసు వేసిన అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు.  రాష్ర్టంలోని ఐదు డిపార్ట్​మెంట్ల గురుకులాల్లో 304 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ కోసం 2017లో జూన్​ 2న టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా పోస్టులకు బీఈడీ, పీజీ అర్హతతో ఐదేండ్ల టీచింగ్ అనుభవం, మూడేండ్ల స్కూల్​ లేదా కాలేజీ ప్రిన్సిపల్/ హెచ్​ఎం గా పనిచేసిన ఎక్స్​పీరియన్స్ ఉండాలని నిబంధనలు పెట్టారు. దీంతో ఆయా పోస్టులకు3 వేల వరకు అప్లికేషన్లు వచ్చాయి. వారందరికీ 2017సెప్టెంబర్ 10న ప్రిలిమ్స్ నిర్వహించి, ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత 1: 7 రెషియోలో మెయిన్స్​ కు సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలోనే మరో రెండుమూడు సార్లు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అర్హతలు లేవనే కారణంతో 924 మందిని టీఎస్​పీఎస్సీ రిజెక్ట్ చేసింది. కేవలం 288 మందితోనే 2019 సెప్టెంబర్​లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. చివరికి 187మందిని ప్రిన్సిపల్ పోస్టులకు సెలెక్ట్ చేస్తున్నట్టు తాజాగా లిస్టు ప్రకటించింది.

కేసు కోర్టులో ఉండగా ఎట్ల ప్రకటిస్తరు?

మొత్తం టీచింగ్ ఎక్స్​పీరియెన్స్ కాకుండా, బీఈడీ, పీజీ పూర్తయిన తర్వాతే ఐదేండ్ల అనుభవం ఉండాలనే దానిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు ఇంటర్వ్యూలకు అనుమతించాలని కొందరు వెళ్లగా, వారికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. అయితే సెలెక్ట్​ లిస్టులో మాత్రం వారి రిజల్ట్ ను పెండింగ్​లో పెట్టారు. ప్రిన్సిపల్ పోస్టుల భర్తీపై హైకోర్టులో దాదాపు 110 కేసులు దాఖలు కాగా, ఇంకా 45 కొనసాగుతున్నాయి. రూల్స్ ప్రకారమే సెలెక్టెడ్ లిస్టు ప్రకటించామని, కోర్టు తుది తీర్పునకు లోబడే రిక్రూట్​మెంట్ ప్రాసెస్ ఉంటుందని టీఎస్​పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.