
వెలుగు, నెట్వర్క్: తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం జనసంద్రంగా మారింది. స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లో బారులుదీరారు. అలివేలు మంగతాయారు అమ్మవారి ఆలయం,శివాలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో నిండిపోయాయి.
చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామి వారికి లక్ష పుష్పార్చన చేశారు. కురుమూర్తి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చా. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గణపతి పూజ, అభిషేకం, అర్చన నిర్వహించారు.
అనంతరం జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్ లో గంటల తరబడి వేచి ఉన్నారు. ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని కృష్ణా నదిలో వారాహీ దేవి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. పెబ్బేరు లలితాదేవి ఆలయంలో దేవి ఉత్సవాలు ఈ ఏడాది మొదటిసారి ప్రారంభించారు. అచ్చంపేట మండలం ఉమామహేశ్వర ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు.
కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లోని వేంకటేశ్వరస్వామి, శివాలయం, లక్ష్మీ చెన్నకేశవస్వామి, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికల్ మండలం చిత్తనూర్ రామాలయంలో సుదర్శన హోమం జరిపించారు. తొలి ఏకాదశి సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి ఎర్త్ సెంటర్ లో ఔషధ, పూల మొక్కలతో భూదేవిని అలంకరించారు. వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి, పాండురంగస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.