ఫిఫా వరల్డ్ కప్ : బ్రెజిల్ కు షాక్.. సెమీస్‌‌‌‌లోకి క్రొయేషియా

ఫిఫా వరల్డ్ కప్ : బ్రెజిల్ కు షాక్.. సెమీస్‌‌‌‌లోకి క్రొయేషియా

దోహా: ఐదుసార్లు చాంపియన్‌‌‌‌ బ్రెజిల్‌‌కు.. ఫిఫా వరల్డ్‌‌కప్‌‌లో ఊహించని షాక్‌‌. మ్యాచ్‌‌ మొత్తం గ్రౌండ్‌‌లో బాల్‌‌పై తిరుగులేని ఆధిపత్యం చూపెట్టినా.. కీలకమైన పెనాల్టీ షూటౌట్​లో ఘోరంగా చేతులెత్తేసింది. దీంతో శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో క్రొయేషియా 4–2 (పెనాల్టీ)తో బ్రెజిల్‌‌పై నెగ్గి సెమీస్‌‌లోకి దూసుకెళ్లింది. పెనాల్టీ షుటౌట్‌‌లో క్రొయేషియా తరఫున నికోలా వ్లాసిక్‌‌, లోవ్రో మజేర్‌‌, లుకా మోడ్రిచ్‌‌, మిస్లావ్‌‌ వోర్స్‌‌ గోల్స్‌‌ సాధించగా, బ్రెజిల్‌‌ తరఫున కాస్మెరో, పెడ్రో మాత్రమే గోల్‌‌ పోస్ట్‌‌లోకి బాల్‌‌ను పంపారు. రొడ్రిగో కొట్టిన షాట్‌‌ను క్రొయేషియా గోలీ డోమ్నికా లివాకోవిచ్‌‌ అద్భుతంగా అడ్డుకోగా, మార్కిన్హో షాట్‌‌ గోల్‌‌ పోస్ట్‌‌కు తాకి బయటకు పోవడంతో బ్రెజిల్‌‌ ఫ్యాన్స్‌‌ నిరాశలో మునిగిపోయారు. అంతకుముందు రెగ్యులర్‌‌ టైమ్‌‌లో  బ్రెజిల్‌‌కు నెయ్‌‌మార్‌‌ (105+1వ ని.), క్రొయేషియాకు బ్రూనో పెట్రోవిచ్‌‌ (117వ ని.) గోల్స్‌‌ అందించారు. ఎక్స్‌‌ట్రా టైమ్‌‌లో గ్రౌండ్‌‌ మధ్య నుంచి టు వన్‌‌ టు స్ట్రాటజీతో బాల్‌‌ను ముందుకు తీసుకొచ్చిన పక్వెటా.. పెనాల్టీ ఏరియాలో నెయ్‌‌మార్‌‌కు అందించాడు. అక్కడి నుంచి తన డ్రిబ్లింగ్‌‌ స్కిల్‌‌తో బాల్‌‌ను కార్నర్‌‌ వరకు తీసుకెళ్లిన జూనియర్‌‌.. క్షణాల్లో దిశను మార్చి వాయు వేగంతో గోల్‌‌పోస్ట్‌‌లోకి పంపాడు. అంతే క్రొయేషియన్లు షాక్‌‌కు గురికాగా, స్టేడియం మొత్తం నెయ్‌‌మార్‌‌ జపంతో ఊగిపోయింది. కెరీర్‌‌లో 77వ గోల్‌‌ సాధించిన నెయ్‌‌మార్‌‌.. బ్రెజిల్‌‌ తరఫున పీలే ఆల్‌‌టైమ్‌‌ రికార్డును సమం చేశాడు. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. కొద్దిసేపటికే బాటమ్‌‌ కార్నర్‌‌ నుంచి లెఫ్ట్‌‌ ఫుట్‌‌ షాట్‌‌తో బ్రూనో గోల్‌‌ కొట్టి స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్‌‌ పెనాల్టీ షూటౌట్‌‌కు దారి తీసింది. 

పటిష్టమైన డిఫెన్స్​తో

ఆట ఆరంభం నుంచి ఇరుజట్లు పటిష్టమైన డిఫెన్స్‌‌తో ముందుకెళ్లాయి. అయినప్పటికీ బ్రెజిల్‌‌ ఫార్వర్డ్స్‌‌.. వేగం, కచ్చితత్వంతో పోటీపడుతూ క్రొయేషియా డిఫెన్స్‌‌ను ఛేదించే ప్రయత్నం చేశారు. 5వ నిమిషంలో విన్సియస్‌‌ జూనియర్‌‌ (బ్రెజిల్‌‌) కొట్టిన లాంగ్‌‌ రేంజ్‌‌ పాస్‌‌ను క్రొయేషియా గోల్‌‌ కీపర్‌‌ లివాకోవిచ్‌‌ సమర్థంగా నిలువరించాడు. 11వ నిమిషంలో నెయ్‌‌మార్‌‌ కొట్టిన బాల్‌‌ ఆఫ్‌‌సైడ్‌‌ పోవడంతో క్రొయేషియా ఊపిరి పీల్చుకుంది. 13వ నిమిషంలో మోడ్రిచ్​ డెలివరీని గోల్‌‌ పోస్ట్‌‌ ముందు అడ్డుకున్నారు. నెయ్‌‌మార్‌‌ రెండు, మూడుసార్లు కళ్లు చెదిరే పాస్‌‌లతో ప్రత్యర్థి గోల్‌‌ పోస్ట్‌‌ వరకు దూసుకుపోయినా సక్సెస్‌‌ కాలేకపోయాడు. ఓవరాల్‌‌గా ఇరుజట్లు ఫ్రీ కిక్స్‌‌తో ఎక్కువగా బాల్‌‌పై పట్టు కోసం ప్రయత్నించాయి. దీంతో తొలి హాఫ్‌‌ గోల్స్‌‌ లేకుండానే ముగిసింది. సెకండ్‌‌ హాఫ్‌‌లో ఇరుజట్లు స్ట్రాటజీలను మార్చాయి. కీలక ప్లేయర్లను తప్పిస్తూ కుర్రాళ్లను దించి వేగం పెంచాయి. బ్రెజిల్‌‌ స్టార్లందరూ క్రొయేషియా డిఫెన్స్‌‌పై ఎదురుదాడి చేసినా గోలీ లివాకోవిచ్‌‌ సమర్థంగా అడ్డుకున్నాడు. బ్రెజిల్‌‌ 51 శాతం బాల్‌‌ను ఆధీనంలో ఉంచుకోగా, క్రొయేషియా 49 శాతంతో గట్టిపోటీ ఇచ్చింది. గోల్స్‌‌ కోసం బ్రెజిల్‌‌ 15సార్లు, క్రొయేషియా ఆరుసార్లు ప్రయత్నించాయి. బ్రెజిల్‌‌ ఎనిమిదిసార్లు టార్గెట్‌‌కు చేరువగా వచ్చి ఫెయిలైంది.