వచ్చే సీజన్‌‌ నుంచి పంట బీమా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ షురూ

వచ్చే సీజన్‌‌ నుంచి పంట బీమా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ షురూ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం ఫసల్‌‌ బీమాలో చేరేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. ఫసల్‌‌ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అలాగే పంటల బీమాకు అవసరమైన మార్గదర్శకాలను రెడీ చేస్తున్నారు. ఇందులో ఫసల్‌‌ బీమా మార్గదర్శకాలను ఇందులో పరిగణనలోకి తీసుకోనున్నారు. వచ్చే వానాకాలం సీజన్‌‌ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. పంటల బీమా అమల్లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతన్నలకు ఆర్థిక సాయం చేసే వీలుంటుంది.

మూడేళ్లు నష్టపోయిన రైతులు..

ప్రధాన మంత్రి ఫసల్‌‌ బీమా యోజన 2019–20 వరకు రాష్ట్రంలో కొనసాగింది. కానీ 2020లో ఈ పథకం నుంచి రాష్ట్రం తప్పుకుంది. అప్పటి నుంచి పంటల బీమా పథకం లేకపోవడంతో విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులు ఎలాంటి బీమా అందుకోలేకపోయారు. 2020–21 రెండు సీజన్లలో 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. 2021–22లో దాదాపు 12 లక్షల ఎకరాలు, 2022–23లో మార్చి, ఏప్రిల్‌‌లో వర్షాలకు 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఎన్నికల ఏడాది కావడంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.230 కోట్లు పరిహారంగా గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం ప్రకటించింది. గత డిసెంబర్‌‌లో రాష్ట్రంలో తుఫాన్‌‌ కారణంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. 

మార్గదర్శకాలకు సన్నాహాలు..

బెంగాల్, ఏపీ తరహాలో తెలంగాణలో కూడా పంటల బీమా పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా ఫసల్‌‌ బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి 95 శాతానికి పైగా బీమా ప్రీమియం చెల్లిస్తుండగా, మిగతా 1.5% నుంచి 5% వరకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. రైతుల ప్రీమియం రాష్ట్ర సర్కారు భరించాలా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాసి అనుమతి వచ్చాక మార్గదర్శకాలు సిద్ధం చేయనున్నారు. బీమా కంపెనీల నుంచి బిడ్లు సేకరించి ధర నిర్ణయించనున్నారు. ఈ వ్యవహారం పూర్తయితే వచ్చే సీజన్‌‌ నుంచి పంట బీమా అమల్లోకి రానుంది.