నిజామాబాద్​ జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలు

నిజామాబాద్​ జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలు
  •     భారీ వర్షాలతో అన్నదాతకు కష్టాలు
  •     జిల్లావ్యాప్తంగా 33,429 ఎకరాల్లో పంట నష్టం
  •     21,697 ఎకరాల్లో వరి లాస్​

నిజామాబాద్, వెలుగు : నిన్నటివరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా 24,035 మంది రైతులకు సంబంధించి 33,429 ఎకరాల్లో పంట నీట మునిగింది. చాలాచోట్ల పచ్చని పంటపొలాల్లో ఇసుక మేటలు వేసింది. అధికారుల అంచనా ప్రకారం 5,500 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు సమాచారం.

వరి పంటకు ఎక్కువ లాస్..​

జిల్లాలో బోరుబావుల కింద సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఏకధాటిగా కురిసిన వర్షాలకు  21,697 ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతింది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్​ రూరల్​నియోజకవర్గాల వరి రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లింది. 5,279 ఎకరాల సోయాబీన్​ పంట నీట మునిగింది. బోధన్, రెంజల్, ఎడపల్లి, కోటగిరి మండలాల సోయా నష్టం అధికంగా ఉంది. 5,006 ఎకరాల్లో మక్క, 1,447 ఎకరాల్లో పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఆర్మూర్, బాల్కొండలో అధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేసిన అన్నదాతలు ఎక్కువగా లాసయ్యారు.

నీటమునిగిన పంటల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని,  నష్టం మరింత ఎకువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి దుక్కి, దమ్ము, నాటు కూలీ, యూరియా తదితరాలను లెక్కిస్తే ఎకరానికి రైతులు ఇప్పటిదాకా కనీసం రూ.12 వేలకు పైగా ఖర్చు చేశారు. సోయా, పసుపు పంటలకు పెట్టుబడి మరింత ఎక్కువగానే ఉంటుంది. ఈ లెక్కన సుమారు రూ.45 కోట్ల నష్టం వాటిల్లింది.

నీరు తగ్గాకే కరెంట్ ​స్తంభాలు..

జిల్లాలో 15 చోట్ల కరెంట్​ట్రాన్స్​ఫార్మర్లు కిందపడ్డాయి. వాటి చుట్టూ చాలా దూరం వరకు వర్షం నీరు ఉంది. నీరు తగ్గితే గానీ వాటి రిపేర్ ​సాధ్యం కాదు.11 కేవీ లైన్​పోల్స్​72, వీధి స్తంభాలు 152 పడిపోయాయి. ట్రాన్స్​కో అధికారులు కొత్త స్తంభాలు తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. 8 చోట్ల ఆర్​అండ్​బీ రోడ్లు కట్టయ్యాయి. వరద నీటి ఉధృతికి మరో 20 రోడ్లు ధ్వంసమయ్యాయి.