పంట నష్టపోయి.. అప్పుల బాధలతో..

పంట నష్టపోయి.. అప్పుల బాధలతో..
  • పంట నష్టపోయి మహబూబాబాద్​ జిల్లాలో ఇద్దరు
  • అధికారులు పాస్​బుక్​ తీసుకెళ్లారని మెదక్​ జిల్లాలో ఒకరు
  • అప్పుల బాధతో సిరిసిల్ల జిల్లాలో మరొకరు..

రామాయంపేట / మహబూబాబాద్​ అర్బన్ / కోనరావుపేట, వెలుగు: రాష్ట్రంలో మరో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఫారెస్ట్​ ఆఫీసర్లు గుంజుకుంటరేమోనన్న బెంగతో ఒకరు, పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక ఇద్దరు, సర్కారు వడ్లు కొనదన్న బెంగ, అప్పుల బాధతో ఇంకొక రైతు ప్రాణాలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన ఫణి నర్సయ్య (52) వరి సాగు చేశాడు. పంట దిగుబడి తక్కువ రావడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో ఆవేదన చెందాడు. ఈ మధ్యే కూతురు పెండ్లి చేశాడు. దానికి రూ.5 లక్షల దాకా అప్పయింది. మళ్లీ వరి వేయొద్దని, యాసంగి వడ్లను కొనబోమని సర్కారు పదేపదే చెప్తుండడంతో దిగులు పెట్టుకున్నాడు. అప్పులెట్లా తీర్చాలో తెలియక బుగులు పెంచుకున్నాడు. ఆ బాధతోనే ఊరి శివారులో చెట్టుకు ఉరేసుకున్నాడు. నర్సయ్యకు భార్య ప్రమీల, కొడుకు అరవింద్​, కూతురు ఉన్నారు. మహబూబాద్​ జిల్లా కే సముద్రానికి చెందిన భూక్య బాలు (43) తనకున్న 30 గుంటల భూమిలో మిర్చి పంట వేశాడు.  మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు.
పెట్టుబడి కోసం రూ.5 లక్షల దాకా అప్పు చేశాడు. అయితే, ఈ మధ్య మిర్చి పంటకు వైరస్​ సోకింది. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదు. దానికి తోడు వడ్ల దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆవేదన చెందిన బాలు.. ఇంట్లో ఎవరూ లేని టైంలో పురుగుల మందు తాగాడు. తర్వాత ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు బాలును వెంటనే మహబూబాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. దారిలోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుకు భార్య భద్రమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. 
మరో మిర్చి రైతు..
మహబూబాబాద్ జిల్లాలోని పర్వతగిరిలో అప్పుల బాధతో మరో  మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నారపల్లి సంపత్(29) తన పొలంలో మిర్చి వేశాడు. తెగుళ్లతో పంట నష్టపోవడంతో  సాగు పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలా అనే మనస్తాపంతో బుధవారం రాత్రి పది గంటలకు పురుగుల మందు తాగి చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రైతు ఆత్మహత్యచేసుకున్నట్టు సమాచారం అందిందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రూరల్ ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
భూమి పోతుందన్న భయంతో...
మెదక్​ జిల్లా రామాయంపేట మండలం శివ్వాయిపేటకు చెందిన ముత్యాలు, అతడి తల్లి బాలవ్వకు శివ్వాయిపేట సర్వే నెంబర్​ 176/13లో చెరి 30 గుంటల భూమి ఉంది. అందులో బోరు వేసుకుని చాలా ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ల పేరు మీద అధికారులు పట్టాపాస్​ పుస్తకాలు కూడా ఇచ్చారు. భూప్రక్షాళన తర్వాత కొత్త పాస్​ బుక్కులనూ జారీ చేశారు. రెండేండ్ల కిందట ఆ భూమి రిజర్వ్​ ఫారెస్ట్​ పరిధిలో ఉందని ఫారెస్ట్​ ఆఫీసర్లు చెప్పడంతో.. రెవెన్యూ అధికారులు ముత్యాలు దగ్గరున్న పాస్​బుక్కును తీసుకెళ్లిపోయారు. అప్పట్నుంచి అతడికి రైతుబంధు పైసలు కూడా పడట్లేదు. రైతుబీమాకూ అప్లై చేసుకోలేకపోయాడు. పాస్​ బుక్​ లేక ఇటు పండించిన పంటనూ కొనుగోలు సెంటర్లలో అమ్ముకోలేకపోయాడు. దీంతో పాస్​బుక్​ను ఇప్పించాల్సిందిగా తహసీల్దార్​, కలెక్టర్​కు ముత్యాలు అర్జీ పెట్టుకున్నాడు. ఎమ్మెల్యేకీ మొరపెట్టుకున్నాడు. అయినా పాస్​బుక్​ను తిరిగివ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ముత్యాలు.. ఉన్న భూమిని కూడా ఫారెస్టోళ్లు గుంజుకుంటరేమోనని కలత చెంది పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముత్యాలు భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలన్న ఆర్డర్సేవీ తమకు లేవని, ఆ భూమి జోలికి తాము పోలేదని డిప్యూటీ రేంజ్​ ఆఫీసర్​ కుత్బుద్దీన్​ చెప్పారు. 176/13 సర్వే నెంబర్లలోని భూములు ఫారెస్ట్​కు చెందినవని పాత రికార్డుల్లో ఉందన్నారు.