నీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్

నీళ్లు లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నయ్
  • ఎండుతున్న పంటలు..రైతులకు తిప్పలు
  • కడెం ఆయకట్టు పరిధిలో బావులు తవ్వుకుంటున్నరు
  • నాగార్జునసాగర్​, ఎస్సారెస్పీ కెనాల్స్​కు అడ్డుకట్టలు కట్టి పారించుకుంటున్నరు
  • ప్రాజెక్టుల్లో నీళ్లున్నా కెనాల్స్​కు రిపేర్లు చేయక, లిఫ్టుల మెయింటెనెన్స్​ లేక సమస్యలు


వెలుగు, నెట్​వర్క్: రాష్ట్ర రైతులు ఈ సారి  రికార్డు స్థాయిలో 68.53 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేయగా.. వారి ఆశలపై సర్కారు నీళ్లు చల్లుతున్నది.  ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లున్నా  కెనాల్స్​ రిపేర్లు చేయకపోవడం, లిఫ్టుల మెయింటెనెన్స్​ గాలికి వదిలేయడం లాంటి కారణాలతో లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందడం లేదు. ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్​ లాంటి కీలక ప్రాజెక్టుల కింద వారబందీ అమలు చేస్తుండడంతో చివరి ఆయకట్టు భూములకు నీళ్లు చేరడం లేదు. ఈసారి కెనాల్ ​వాటర్​పై ఆశలు పెట్టుకొని  53.08 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. కానీ కాల్వ నీళ్లు అందక సుమారు 10 లక్షల ఎకరాల వరకు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే చాలా చోట్ల పొలాలు నెర్రెలు బారుతుండగా, వాటిని  కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడ్తున్నారు. సాగర్​, ఎస్సారెస్పీ కెనాల్స్​కు అడ్డుకట్టలు కట్టి నీళ్లు పారించుకుంటుండగా.. కడెం ఆయకట్టు కింద రైతులైతే ఏకంగా కొత్త బావులు తవ్వుకుంటున్నారు. 


మంచిర్యాల జిల్లా గూడెం లిఫ్ట్​ కింద ఆయకట్టుకు సాగునీళ్లు రాక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ లిఫ్ట్​ నిర్మించారు. ఈ మూడు మండలాల్లోని 30వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీల నీటిని అందించాల్సిఉంది. 2015లో లిఫ్ట్​ను  ప్రారంభించినప్పటి నుంచి ఏనాడూ పూర్తిస్థాయిలో నీళ్లివ్వలేదు.  నాసిరకం పైపులు వేయడం వల్ల తరచూ పగిలిపోతున్నాయి. రెండు మోటార్లు ఆన్ చేస్తే ప్రెషర్​కు పైపులు పైకి లేస్తున్నాయి. దీంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. నిరుడు జులైలో గోదావరికి వచ్చిన వరదల్లో లిఫ్ట్ పూర్తిగా మునిగిపోయింది. ఇటీవల రిపేర్లు చేసి మోటార్లు స్టార్ట్ చేయగా మొరాయిస్తున్నాయి. గత డిసెంబర్ నుంచి ఒక్కరోజు కూడా సజావుగా  నీళ్లు ఇయ్యలేకపోతున్నారు. 30 వేల ఎకరాల ఆయకట్టుకు గాను యాసంగిలో 20 వేల ఎకరాల్లో వరి, మక్క పంటలు వేశారు. ఇప్పటికే సుమారు 10 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. బావులు, బోర్లు అడుగంటిపోయాయి. రైతులు వేలల్లో ఖర్చు పెట్టి జేసీబీలతో బావుల లోతు తీయిస్తున్నారు. మరికొందరు కొత్తగా బావులు తవ్విస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ. 25వేల వరకు నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

నాగార్జునసాగర్​ కింద..

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ లెఫ్ట్​ కెనాల్​కింద వారబందీ పద్ధతిలో సాగునీరు విడుదల చేస్తుండడంతో చివరి భూములకు చేరడం లేదు. రాజవరం మేజర్​డిస్ట్రిబ్యూటరీ  కింద  8,500 ఎకరాల  ఆయకట్టును స్థిరీకరించగా, ప్రస్తుతం  మరో 5 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. పాత లెక్కల ప్రకారమే  నీటిని  విడుదల చేస్తుండడంతో రాజవరం, బోయగూడెం, యల్లాపురం గ్రామాల్లోని 2,000 ఎకరాల్లో పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పంటలు కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడ్తున్నారు. అటు ఖమ్మం జిల్లాలోనూ సాగర్​ ఎడమ కాల్వ కింద  నీరందక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో సాగర్​ కాల్వల కింద రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.  వచ్చే  మార్చి 31 వరకు యాసంగి పంటలకు వారబందీ పద్దతిలో 21.50 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్​ అధికారులు నిర్ణయించారు.  జిల్లాలోని 17 మండలాల్లో 87 రోజుల్లో 8 విడతలుగా నీళ్లివ్వాలని ప్లాన్​ చేశారు. అయితే కల్లూరు నుంచి ఎర్రుపాలెం వరకు మూడో జోన్​ పరిధిలోని కల్లూరు, బోనకల్, ఊట్కూరు మేజర్ కాల్వలకు నీరందడంలేదు. బోనకల్​ బ్రాంచ్​ కెనాల్ కు 1,300 క్యూసెక్యుల నీటిని విడుదల చేయాల్సిఉండగా అందులో సగానికన్నా తక్కువ నీటిని వదులుతున్నారు. దీంతో  కాల్వ చివరి వరి పొలాలకు నీరు అందక ఎండిపోయి నెర్రెలు బారుతున్నాయి.  మక్క  కంకులు పాలు పోసుకునే టైమ్​ లో నీళ్లందకపోవడంతో దిగుబడి ఉండదని రైతులు వాపోతున్నారు. 

మిడ్​ మానేరు కింద.. 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్, హనుమాజిపల్లి మధ్య మిడ్ మానేర్ డి-9-1 సబ్ కెనాల్ పనులు పూర్తి కాకపోవడంతో హన్మజిపల్లె, మాదాపూర్, మైలారం గ్రామాలకు సాగునీరందడం లేదు. కేవలం 150 మీటర్ల కాల్వ తవ్వకం పనులు పూర్తికాక పొలాలకు నీరు వస్తలేదు. సబ్ కెనాల్ పూర్తయితే 600 ఎకరాలకు నీరందుతుంది. కెనాల్​ పూర్తి చేయాలని రైతులు  ఇటీవల ధర్నాతో పాటు హనుమాజిపల్లి నుంచి మాదాపూర్ వరకు  పాదయాత్ర చేపట్టారు.  సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం 9, 10, 11, 12 ప్యాకేజీల కింద 50 వేల ఎకరాలు ఉండగా 34 వేల ఎకరాలకే సాగునీరు అందుతున్నది. అటు మిడ్​మానేరు కింద 6వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, కెనాల్స్​ నిర్మాణం పూర్తికాక ఒక్క ఎకరానికి కూడా నీరందడంలేదు.

మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.. 

  • ఆసిఫాబాద్​లోని కుమ్రంభీం ప్రాజెక్ట్  పూర్తయి 15 ఏండ్లయినా కెనాల్స్​ నిర్మాణం పూర్తికాక ఆయకట్టుకు నీరు వస్తలేదు. కుడి కాలువ, డిస్ట్రిబ్యూటరీలు  చాలాచోట్ల పూడుకపోయాయి. కొన్ని చోట్ల కెనాల్స్​ ధ్వంసమయ్యాయి. రిపేర్లకు పైసల్లేక వదిలేయడంతో 5 వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి.
  •  నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కింద  52 వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా..  ప్రస్తుతం ప్రాజెక్ట్ లో నీటి మట్టం తగ్గడంతో 35 వేల ఎకరాలకే నీరు ఇస్తున్నారు.  
  •  నిర్మల్ జిల్లా  భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ కింద 14  వేల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉండగా.. 8 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందుతున్నది. ప్రాజెక్ట్ ప్రధాన 42 కిలోమీటర్ల పొడవు ఉండగా,  32 కిలోమీటర్ల వరకే  లైనింగ్ పనులు పూర్తి చేశారు. మరో పది కిలోమీటర్ల వరకు లైనింగ్​ పనులు జరగక.. నీరు చివరి వరకు చేరడంలేదు. 
  •  వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని భీమా ఫేస్ 2 కింద నిర్మించిన శంకర సముద్రం రిజర్వాయర్ కుడికాలువ ద్వారా 35 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. పదేండ్ల కింద కాల్వలు నిర్మించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంతో వారు గ్రామాన్ని ఖాళీ చేయకపోవడంతో  రిజర్వాయర్ ను పూర్తిగా నింపటం లేదు. దీంతో కుడి కాలువ కింది  నిర్విన్, కనిమెట్ట, పాత జంగమయ్యపల్లి, కన్మనూరు, బలీదుపల్లి గ్రామాలకు పదేండ్లుగా సాగునీరందించటం లేదు.  
  • భద్రాచలం మన్యంలో తాలిపేరు ప్రాజెక్టు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో  24,600 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.  వానా కాలం సీజన్​లోనే సాగునీరు అందుతుండగా,  యాసంగిలో  చాలా ఏండ్లనుంచి దుమ్ముగూడెం మండలంలోని చివరి భూములకు  సాగునీరు రావడం లేదు.  ఎడమ కాల్వ కింద 5వేల ఎకరాలకు యాసంగిలో అసలు  నీరు ఇవ్వడం లేదు.
  • మహబూబ్​నగర్ జిల్లా కోయిల్​సాగర్ ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వల ద్వారా 50,250 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ప్రస్తుతం 18 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. రైట్ కెనాల్లో పూడిక నిండిపోవడంతో లాల్కోట, నెల్లికొండి, వడ్డేమాన్ వరకు ఉన్న వెయ్యి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. లెఫ్ట్ కెనాల్ కింద కాలువ పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ కెనాల్ కింద గూరకొండ, బల్సుపల్లి పరిధిలో ఉన్న 1,200 ఎకరాలకు సాగునీరు అందడం లేదు.

రూ.2 లక్షలు పెట్టి బావి తవ్విస్తున్నడు.. 

ఈయన పేరు పోచమల్లు.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం టీకానపల్లి వాసి. గూడెం లిఫ్టు ను నమ్ముకొని ఆరెకరాల్లో వరి సాగు చేసిండు. కానీ 42 కెనాల్​ దాకా నీళ్లు రాక పొలమంతా ఎండిపోతున్నది. దీంతో ఉన్నదైనా కాపాడుకుందామని పొలంలో రూ. 2లక్షల ఖర్చుతో బావి తవ్విస్తున్నడు. 

కండ్ల ముందే  ఎండిపోతున్నయ్​

ఆరెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న వేసిన. బోనకల్ బ్రాంచ్ కెనాల్​కు 1,300కు గాను  600 క్యూసెక్కుల నీటిని  మాత్రమే వదులుతుండడంతో చివరి పొలాలకు నీళ్లు వస్తలేవ్.​ నీళ్లు అందక కండ్ల ముంగట్నే పంటలు ఎండుతున్నయ్‌‌. 
- అల్లిక అబ్బయ్య, రైతు, ఆళ్లపాడు, 
బోనకల్ మండలం, ఖమ్మం జిల్లా

నీళ్లిస్తమని చెప్పి ఇస్తలేరు

డిసెంబర్​ నుంచి నీళ్లిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన్రు. నేను ఆరు ఎకరాల్లో నాటేసిన. తీరా ఇప్పుడు నీళ్లస్తలేవ్​. ఎకరానికి రూ.25 వేల దాకా పెట్టినం. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి. 
- తనుగుల కిరణ్​, జెండావెంకటాపూర్ , మంచిర్యాల జిల్లా

ఇబ్బంది లేకుండా చూస్తాం

నాగార్జునసాగర్​ ఆయకట్టు చివరి భూములకు ఏటా ఈ సమస్య వస్తున్నది. దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నం. రెండ్రోజుల కింద ఇరిగేషన్​, అగ్రికల్చర్​, హార్టికల్చర్​, విద్యుత్​ శాఖల అధికారులతో కలెక్టర్​ రివ్యూ నిర్వహించారు. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నం. బోనకల్ బ్రాంచ్​ కెనాల్ కింద పంటలు చేతికందుదాక తగినంత నీటిని అందిస్తం. 
- శంకర్​ నాయక్​, సీఈ, ఇరిగేషన్​