వర్షంతో పంట నష్టం..రైతు ఆత్మహత్య

వర్షంతో పంట  నష్టం..రైతు ఆత్మహత్య
  • వర్షంతో పంట  నష్టం..రైతు ఆత్మహత్య
  • ములుగు జిల్లాలో ఘటన
  • ధరణి పోర్టల్‌‌లో భూమి ఎక్కలేదన్న మనస్తాపంతో మెదక్‌‌ జిల్లా మహిళకు గుండెపోటు

తాడ్వాయి/కౌడిపల్లి, వెలుగు : అకాల వర్షంతో పంట దెబ్బతినడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనేపల్లి గ్రామానికి చెందిన చింత అనిల్ (36) తనకున్న నాలుగెకరాల్లో ఒక ఎకరంలో మిర్చి, మరో మూడెకరాల్లో వరి సాగు చేశాడు. పంట పెట్టుబడి కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. 

ఇటీవలి తుఫాన్‌‌‌‌‌‌‌‌ కారణంగా వారం రోజులు కురిసిన వర్షాలకు పంట మొత్తం దెబ్బతిన్నది. దీంతో సుమారు రూ.70 వేల మేర నష్టం జరిగింది. పెట్టుబడి కోసం చేసిన అప్పు పెరగడం, పంట దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపం చెందిన అనిల్‌‌‌‌‌‌‌‌ శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తుండగా, చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

భూమి పోతుందన్న మనస్తాపంతో కుప్పకూలిన మహిళ..

ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమి అధికారుల సర్వేలో తమకు దక్కకుండా పోతుందన్న మనస్తాపంతో ఓ మహిళ గుండెపోటుకు గురై చనిపోయింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్ తండాకు చెందిన రామావత్ లక్ష్మి (60) పేరు మీద 388, 393 సర్వే నంబర్లలో 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. కొన్నేండ్లుగా ఆమె ఆ భూమిని సాగు చేసుకుంటోంది. రెవెన్యూ రికార్డులో కూడా భూమి లక్ష్మి పేరు మీదే ఉంది. ధరణి పోర్టల్ రాకముందు పాస్ బుక్ కూడా ఉండేది. పోర్టల్ వచ్చాక లక్ష్మికి కొత్త పట్టాదార్ పాస్ బుక్ రాలేదు. తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో, కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె కూలి పనికి వెళ్లిన సమయంలో భూమి సర్వే చేసేందుకు ఆఫీసర్లు వచ్చారని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో తన భూమి తనకు దక్కదేమోనని మనస్తాపం చెందిన లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే ఆమె కుమారులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పాస్ బుక్ రాకపోవడంతో భూమి దక్కదనే మనస్తాపంతో లక్ష్మి మృతి చెందిందని కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పట్టాబుక్​ కోసం రెఫర్​ చేస్తాం..

తండాలోని 388, 393 సర్వే నంబర్లలో 500 ఎకరాల భూమి ఉందని, అందులో గిరిజనులకు కేటాయించిన అటవీ భూమి కూడా ఉందని తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. ఆ సర్వే నంబర్లలో గిరిజనుల భూమి తేల్చేందుకు రెండు, మూడ్రోజులుగా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో సర్వే చేస్తున్నామని, అర్హులను గుర్తించి వారికి పట్టాదార్ పాస్ బుక్కులు వచ్చేలా చేస్తామన్నారు. మృతురాలికి పట్టా బుక్ రాకపోవడానికి సాంకేతిక సమస్య కూడా కారణమని ఆయన వెల్లడించారు.