అందరి దృష్టి ఆ రెండింటిపైనే!.. భద్రాచలం, లక్ష్మీపురం పంచాయతీ ఎన్నికల బరిలో అభ్యర్థుల పోటాపోటీ

అందరి దృష్టి ఆ రెండింటిపైనే!..  భద్రాచలం, లక్ష్మీపురం పంచాయతీ ఎన్నికల బరిలో అభ్యర్థుల పోటాపోటీ
  • ఖర్చుకు వెనుకాడకుండా.. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు 
  • భద్రాచలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, లక్ష్మీపురం ఇండస్ట్రియల్​ ఏరియా కావడమే ప్రధానకారణం
  • దశాబ్దం తర్వాత  భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు 
  • టెంపుల్​ డెవలప్​మెంట్ పేర ఏకగ్రీవాలకు స్కెచ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అందరి దృష్టి భద్రాచలం, లక్ష్మీపురం గ్రామ పంచాయతీలపైనే ఉంది. ఈ పంచాయతీల్లో రూ.కోటికిపైగా ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు పొలిటికల్​ పార్టీలు పావులు కదుపుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లోనే భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు దశాబ్దానికి పైగా భద్రాచలం గ్రామపంచాయతీకి ఎన్నికలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న భద్రాచలం పంచాయతీ ఎన్నికలు జిల్లా ప్రజలకు హాట్​ టాపిక్​ గా మారింది. భద్రాచలం మండలంలో భద్రాచలం గ్రామపంచాయతీ ఒక్కటే ఉంది. ఈ పంచాయతీలో 20వార్డులున్నాయి. 

పంచాయతీ ఎస్టీ జనరల్​గా రిజర్వ్​ అయింది. ఎస్టీ జనరల్​కు ఐదు వార్డులు, ఎస్టీ మహిళ ఐదు, అన్​ రిజర్వుడు ఐదు, అన్​ రిజర్వుడు మహిళకు ఐదు చొప్పున వార్డులు రిజర్వ్​ అయ్యాయి. టెంపుల్​ సిటీగా పేరొందిన భద్రాచలం గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు కాంగ్రెస్​తో పాటు బీఆర్​ఎస్​ భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్​ బీఆర్​ఎస్​ నుంచి గెలిచి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. 

కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కసరత్తు చేపట్టారు. సీపీఐతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. సీపీఎం, సీపీఐతో బీఆర్​ఎస్​ నేతలు రాయభారం సాగిస్తున్నారు. బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు ఈ గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. 

ఇండస్ట్రియల్​ఏరియాగా పేరొందిన బూర్గంపహాడ్​ మండలంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గతంలో ఎస్సీగా రిజర్వ్​ అయిన ఈ పంచాయతీని దక్కించుకునేందుకు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీల మద్దతుతో పోటీలో ఉన్న  ఒక్కో అభ్యర్థి దాదాపు రూ. 60లక్షలకు పైగానే ఖర్చు చేసిన దాఖలాలున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్​ఎస్​​ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. ఈ సారి లక్ష్మీపురం గ్రామపంచాయతీ జనరల్​గా కావడంతో పోటీ తీవ్రమైంది. గెలుపే లక్ష్యంగా ఒక్కో అభ్యర్థి రూ. కోటికి పైగా ఖర్చు పెట్టేందుకు  ముందుకువస్తున్నారు. ఈ పంచాయతీలో అటు కాంగ్రెస్​తో పాటు బీఆర్​ఎస్​కు ప్రతిష్టాత్మకంగా మారింది. 

టెంపుల్​పేరుతో ఏకగ్రీవాలకు..

చంద్రుగొండ, బూర్గంపహాడ్​ మండలాలతో పాటు పలుచోట్ల టెంపుల్స్​ డెవలప్​మెంట్​ పేరుతో పంచాయతీ పెద్దలు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడుతున్నారు. తాము అడిగినంత ఇస్తే ఏకగ్రీవం చేస్తామంటూ పలు చోట్ల గ్రామ పంచాయతీ పెద్దలు పోటీచేసే అభ్యర్థులతో పాటు వారికి మద్దతు ఇస్తున్న పార్టీల ముఖ్యులతో మంతనాలు సాగిస్తుండడం గమనార్హం.