రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్

రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్
  •  యూపీలో బీజేపీకి 8 సీట్లు.. ఎస్పీకి 2 సీట్లు
  • కర్నాటకలో 3 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ
  • హిమాచల్ ప్రదేశ్​లో బీజేపీ అభ్యర్థి విజయం

బెంగళూరు, లక్నో: రాజ్యసభ ఎన్నికల ఫలితాలను క్రాస్ ఓటింగ్ మార్చేసింది. ఎమ్మెల్యేల సంఖ్యాబలంఆధారంగా ఎంపీ సీట్లను గెలుచుకునే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సొంత పార్టీకి హ్యాండిచ్చి ప్రత్యర్థులకు ఓటేశారు. దీంతో ఫలితాల అంచనాలు మారిపోయాయి. మంగళవారం మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా.. మూడుచోట్లా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. రాజ్యసభలో మొత్తం 56 సీట్లకు ఎన్నికలు జరిపేందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నెల మొదట్లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 

అయితే, 41 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ లో 10 స్థానాలు, హిమాచల్​ ప్రదేశ్ లో 1, కర్నాటకలో 4 స్థానాలకు మంగళవారం ఈసీ ఎన్నికలు నిర్వహించింది. సాయంత్రం 5 వరకు పోలింగ్​ నిర్వహించి, ఆ తర్వాత కౌంటింగ్​ నిర్వహించింది. అయితే, ఇందులో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో కాంగ్రెస్ గెలవాల్సిన చోట బీజేపీ, బీజేపీ గెలవాల్సిన చోట కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. క్రాస్ ఓటింగ్​ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్​లో బీజేపీకి 8 సీట్లు..

యూపీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలనికి ఏడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే, ఆ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులను బరిలో దింపింది. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు క్రాస్ ఓటింగ్​ కు పాల్పడడంతో బీజేపీ అభ్యర్థులు ఎనిమిది మందీ గెలిచారు. మిగిలిన రెండు స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. 

కాంగ్రెస్ కు కలిసొచ్చిన కర్నాటక..

కర్నాటకలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరగగా.. మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన చోట బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. వాస్తవానికి ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి రెండు చోట్ల గెలిచే బలం మాత్రమే ఉంది. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు క్రాస్ ఓటింగ్​ కు పాల్పడడంతో మూడో సీటునూ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

హిమాచల్​ ప్రదేశ్​లో అనూహ్యం

హిమాచల్ ప్రదేశ్​లో ఒకే ఒక స్థానానికి ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్​కు పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు చెరో 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ సునాయాసంగా గెలవాల్సిన చోట ఫలితం టై అయింది. దీంతో టాస్ వేయగా.. బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్​ను విజయం వరించింది. అయితే, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆరుగురిని, ముగ్గురు స్వంతత్రులను హర్యానా పోలీసులు కిడ్నాప్ చేశారని హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్​ సుఖు ఆరోపించారు. ప్రలోభాలకు గురిచేసి క్రాస్ ఓటింగ్​కు పాల్పడేలా చేశారని మండిపడ్డారు.