సిన్మా హాల్లో లొల్లి కరెక్టా?

సిన్మా హాల్లో లొల్లి కరెక్టా?

సినిమా ఓ అద్భుత ప్రపంచం. కొత్తగా రిలీజ్‌‌ అయిన సినిమాల్ని థియేటర్లకు పోయి చూడటంలో ఒక ఆనందం ఉంది. పాప్‌‌కార్న్‌‌, కూల్‌‌డ్రింక్‌‌, సమోసాల్ని తింటూ స్క్రీన్‌‌పై కదిలే బొమ్మల్ని ఎంజాయ్‌‌ చేయడంలో ఒక సంతోషం దాగుంది.  వీటికి తోడుగా ప్రేక్షకులతో కలిసి వేసే ఈలలు, అరుపులు హాలులో జోష్‌‌ని నింపుతయ్‌‌. థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసే ఆ సౌండ్​ని  క్రౌడ్‌‌–ఛీర్‌‌ మూమెంట్స్‌‌ అంటారు. ‘ఇట్ల చేయడం పద్ధతేనా?’ అని అడిగేటోళ్లు కొందరైతే.. ‘అందులోనే అసలైన మజా ఉంటదని’ అంటున్నోళ్లు మరికొందరు.

మొన్నీమధ్య ట్విట్టర్‌‌ల ఒక వ్యక్తి  ఓ వీడియో పోస్ట్‌‌ చేశాడు. ‘అవెంజర్స్‌‌ ఎండ్‌‌గేమ్’ సినిమాలో ఐరన్‌‌మ్యాన్‌‌ చిటికేసి(స్నాప్‌‌) విలన్ల బ్యాచ్‌‌ని అంతం చేసే వీడియో. సినిమా మొత్తానికే మోస్ట్‌‌ డ్రమటిక్‌‌ సీన్‌‌ అది. అంతవరకు మంచిగనే ఉంది. కానీ.. దాని కింద అతను పెట్టిన క్యాప్షన్‌‌ నెటిజన్స్‌‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సీన్‌‌ వచ్చినప్పుడు థియేటర్‌‌ జనాలు అరుపులతో గోల గోల చేసిండ్రు. ఆ వీడియోను అప్‌‌లోడ్ చేసి మరీ ‘ఇందుకే నేను సినిమాలు తియ్య!’(దిస్‌‌ ఈజ్‌‌ వై ఐ డోంట్‌‌ డూ సినిమాస్‌‌) అనే కామెంట్‌‌ పెట్టిండు ఆ వ్యక్తి.  క్రౌడ్–ఛీర్ మూమెంట్స్‌‌పై అతను వ్యక్తం చేసిన అసంతృప్తి కొందరికి కోపం తెప్పించింది. ముఖ్యంగా మార్వెల్‌‌ ఫ్యాన్స్‌‌ అతనిపై తిట్ల దండకం అందుకున్నారు. అదే టైంలో అతనికి మద్దతుగా థియేటర్‌‌ ఆడియన్స్‌‌ తీరుని తప్పుబట్టిన వాళ్లూ ఉన్నారు. మొత్తానికి లక్షన్నర లైకులు, నలభై వేల రీ–ట్వీట్లతో సోషల్‌‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది అతగాడి పోస్ట్‌‌.

పైసలిచ్చి.. ఈ కర్మేంది?

ఆ వ్యక్తి చేసిన పోస్టుకి చాలా మంది ‘మేం అలాగే  ఫీలయ్యాం’ అని రీ–ట్వీట్లు చేశారు. ఆ మాటకొస్తే ప్రశాంతంగా సినిమా చూద్దామని వెళ్లేవాళ్లు..  ఆడియన్స్‌‌ అరుపుల్ని ఇబ్బందిగానే భావిస్తరు. ‘మా నోర్లు.. మా ఇష్టం.. అరిస్తే నీకేం నొప్పి..’ అని గోల రాయుళ్లు అంటే,  ‘నా చెవులు.. నాకే కష్టం’ అని ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు చెప్తుంటారు. గూస్‌‌ బంప్స్ మూమెంట్ల విషయంలో ఫర్వాలేదుగానీ.. మరీ ప్రతీ సీన్‌‌కి అతిగా రియాక్ట్‌‌ అయ్యేవాళ్లతోనే అసలు ఇబ్బంది అంటున్నారు వాళ్లు. అంతలా ఊగిపోయే ఆ జనాలతో చూడకపోతే వచ్చే నష్టమేం లేదని  కొందరు అంటే..  ఇంకొందరు మాత్రం సినిమా ఊపు కాస్త తగ్గాక అప్పుడు నిమ్మలంగా చూస్తాం అంటున్నారు. ‘పరిస్థితి ఇట్లనే కొనసాగితే థియేటర్ల వైపు వెళ్లకపోవడం బెటర్‌‌’ అనే అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్లూ లేకపోలేదు.  ఓవరాల్‌‌గా డబ్బులిచ్చి జనాల గోల మధ్య సినిమా చూసే కర్మేంది? అనుకునే బాపతు ప్రేక్షకులే ఎక్కువగా ఉన్నారు.

డీసెన్సీ పక్కన పెట్టండి

సినిమా కోసం థియేటర్లకు వెళ్లేవాళ్లు ‘బెస్ట్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌’ కోరుకుంటారు. అయితే ఆ అనుభూతిని సినిమా మధ్యలో ఈలలు, కేకలు, మధ్య మధ్యలో పంచ్‌‌లు వేస్తూ ఆస్వాదిస్తారు కొందరు. ఒకప్పుడు థియేటర్‌‌ గోల మాస్‌‌ థియేటర్లలో మాత్రమే కనిపించేది. ఇప్పుడది మల్టీప్లెక్స్‌‌లలో కూడా కనిపిస్తోంది. ఇక స్టార్ల హార్డ్‌‌కోర్ ఫ్యాన్స్‌‌ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు థియేటర్లలో సందడి మధ్య సినిమాల్ని చూడాలని కోరుకునే వర్గం ఒకటి ఉంటది. ఆ మాత్రం లేకపోతే మజా ఉండదనేది వాళ్ల ఫీలింగ్‌‌.   క్రౌడ్‌‌ రియాక్షన్లను ఆస్వాదించాలే తప్ప, తప్పుగా చూడొద్దని, ఫిర్యాదులు చెయ్యొద్దని చెబుతుంటారు వాళ్లు. క్రౌడ్‌‌ ఫుల్‌‌ సినిమాలకు వచ్చేటప్పుడు డీసెన్సీని పక్కనపెట్టాలంటున్నారు. అది కష్టం అనుకుంటే కొన్నాళ్లు ఆగి ప్రశాంతంగా సినిమా చూడాలని సూచిస్తున్నారు వాళ్లు.

కంట్రోల్‌‌.. కష్టమే!

మనిషిలో భావోద్వేగాల్ని నియంత్రించడం సాధ్యమయ్యే విషయమే . అయితే ‘విజువల్‌‌ కనెక్టివిటి’ విషయంలో ఎమోషన్స్‌‌ని కంట్రోల్‌‌ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్నదని మానసిక నిపుణులు చెప్తున్నారు. ‘సాధారణంగా ఒకరిద్దరిలో ఎమోషన్స్ కంట్రోల్‌‌ చేయడం కష్టమైన పనేం కాదు.  కానీ, ఒక గుంపుగా.. అదీ ఒక ప్రత్యేకమైన వాతావరణం, పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు  నియంత్రించడం అస్సలు వీలు పడదు. క్రౌడ్‌‌ రియాక్షన్ల విషయంలో జరిగేది ఇదే. అలాంటప్పుడు ఎదుటివాళ్ల గురించి ఆలోచించి.. కొందరైనా తమ తీరు మార్చుకోవాలి. అప్పుడు క్రౌడ్‌‌ రియాక్షన్ల మీద ఉన్న నెగెటివ్‌‌ ప్రభావం  కొంచెం తగ్గే అవకాశం ఉంటుందని’ చెబుతున్నారు నిపుణులు.

క్రికెట్​కూ తప్పలేదు

స్లెడ్జింగ్‌‌, చీటింగ్‌‌ లేని ఆట.. ఆటగాళ్లు పద్ధతిగా నడుచుకోవడం, అంపైర్‌‌ నిర్ణయాల్ని గౌరవించడం.. ఇట్లాంటివి ఉండటంతో క్రికెట్‌‌కు జెంటిల్‌‌మెన్‌‌ గేమ్‌‌ అనే పేరొచ్చింది. అఫ్‌‌కోర్స్‌‌.. తర్వాతి కాలంలో ‘ఫెయిర్‌‌ ప్లే’ అనేది గగనంగా మారింది. అదేవిధంగా గేమ్‌‌ చూసేందుకు గ్రౌండ్‌‌లకు వచ్చే జనాల దృష్టి కూడా మారింది. విదేశాల్లో మ్యాచ్‌‌లు జరిగినప్పుడు ఆడియన్స్‌‌ రియాక్షన్లు కొంచెం భిన్నంగా ఉంటాయి. చప్పళ్లు, విజిల్స్‌‌తో సందడి చేస్తారు.
ఒకవేళ నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చినా  సంయమనం పాటిస్తారు. కానీ, మన దగ్గర  మ్యాచ్‌‌లు జరిగినప్పుడు పూర్తి వ్యతిరేక వాతావరణం ఉంటుంది. మనతో పాటు చుట్టుపక్కల ఉన్న  పాకిస్తాన్‌‌, బంగ్లాదేశ్‌‌, శ్రీలంక, కొన్ని ఆఫ్రికన్‌‌ దేశాల్లో ఆడియన్స్‌‌ గోల మామూలుగా ఉండదు. ఆడియన్స్‌‌ ప్రదర్శించే ఆ అతి.. మ్యాచ్‌‌కి అవాంతరం కలిగించిన సందర్భాలు  కూడా ఉన్నాయి.