కిక్కిరిసిన టెంపుల్స్

కిక్కిరిసిన టెంపుల్స్

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా గుడులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. న్యూ ఇయర్ రోజున దేవుళ్ల దర్శనం చేసుకుని, ఆశీస్సులు పొందాలని జనం ఆలయాలకు వెల్లువెత్తారు. ఢిల్లీతో పాటు యూపీ, తదితర ఉత్తరాది రాష్ట్రాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్నాటక సహా అన్ని రాష్ట్రాల్లో టెంపుల్స్ లో ఫుల్ రద్దీ నెలకొంది. కొత్త సంవత్సరం తొలిరోజున సూర్యోదయాన్ని చూసి, ప్రజలు సూర్యనమస్కారాలు చేశారు. 

మహారాష్ట్ర: ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ కు ఆదివారం ఉదయం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గణేషుడిని దర్శించుకుని హారతి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ముంబైలోని ముంబా దేవి టెంపుల్ కు కూడా భారీగా వచ్చిన భక్తులు దేవి దర్శనం చేసుకున్నారు. 

మధ్యప్రదేశ్: ఉజ్జెయిన్ మహాకాలేశ్వర్ టెంపుల్ కూడా భక్తులతో రద్దీగా కనిపించింది. న్యూఇయర్ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున ఈ టెంపుల్ లో శివుడికి ప్రత్యేకంగా ‘భస్మ హారతి’ నిర్వహించారు. శివుడిని మేలుకొల్పేందుకు ఇలా భస్మ హారతి ఇచ్చే సంప్రదాయం ఈ గుడిలో తప్ప ఇంకెక్కడా నిర్వహించకపోవడం విశేషం. 
యూపీ: వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయానికి కూడా ఆదివారం భక్తులు వెల్లువెత్తారు. మహాశివుడిని దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యూఇయర్ సందర్భంగా కాశీ విశ్వనాథుడి టెంపుల్ వద్ద భారీగా క్యూలైన్ లు కనిపించాయి. అలాగే తెల్లవారుజామున ఇక్కడి గంగానది తీరంలోని అస్సీ ఘాట్ వద్ద నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

ఒడిశా: కొత్త సంవత్సరం సందర్భంగా ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని కూడా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సంవత్సరం తొలి సూర్యోదయాన్ని వీక్షించిన తర్వాత సూర్యదేవుడిని ప్రార్థించుకున్నారు. సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్​లో రూపొందించిన జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవతల ఇసుక శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 
తమిళనాడు: న్యూఇయర్ రోజున తమిళనాడులో కూడా టెంపుల్స్ అన్నీ భక్తులతో సందడిగా మారాయి. చెన్నైలోని లార్డ్ మురుగన్ టెంపుల్​కు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి 
దర్శనం చేసుకున్నారు. 

ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్

దేశ రాజధాని ఢిల్లీతో పాటు వెస్ట్ బెంగాల్, పంజాబ్, తదితర రాష్ట్రాల్లోనూ గుడులు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో 108 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఉన్న ఝందేవాలన్ టెంపుల్ కు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారు. కోల్ కతాలోని కాళీ మాత టెంపుల్ కూడా భక్తులతో సందడిగా మారింది. పంజాబ్​లో అమృత్​సర్​లోని గోల్డెన్ టెంపుల్​ వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్​లు కనిపించాయి.