జనవరి 7న యాదగిరిగుట్టలో భక్తులతో కిటకిట

జనవరి 7న యాదగిరిగుట్టలో భక్తులతో కిటకిట

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి  భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొండపైన, కింద ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది.  నారసింహుడి ఉచిత దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.  భక్తులు స్వామివారిని దర్శించుకొని నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.  

కాగా, ఆదివారం ఏకాదశి కావడంతో అర్చకులు లక్షపుష్పార్చన పూజను  వైభవంగా నిర్వహించారు. కర్నాటక రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్, హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి స్వామివారిని  దర్శించుకున్నారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం  రూ.43,61,283 ఆదాయం సమకూరింది.  

ఆలయానికి కిలో వెండి పూలబుట్ట బహూకరణ

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన ఒమేగా హాస్పిటల్ ఎండీ శ్రీకాంతారావు  కిలో వెండితో తయారు చేపించిన పూలబుట్టను ఆదివారం విరాళంగా అందజేశారు.  అంతకుముందు ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తుల చెంత వెండి పూలబుట్టను పెట్టి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ ఏఈవో గజవెల్లి రఘు, సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి చేతుల మీదుగా వెండి పూలబుట్టను ఆలయానికి సమర్పించారు.