క్రూడ్​ పామాయిల్​ధర తగ్గింపు

 క్రూడ్​ పామాయిల్​ధర తగ్గింపు

5.5 శాతానికి తగ్గిన సుంకం
న్యూఢిల్లీ: చుక్కల్లో ఉన్న వంట నూనెల ధరలను దింపడానికి కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్​పై మరోసారి దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇది 8.25 శాతం ఉండగా, ఇక నుంచి 5.5 శాతం వసూలు చేస్తారు. దీనివల్ల నూనెల ధరలు తగ్గడంతోపాటు ఇండియాలోని ఆయిల్​ కంపెనీలకూ మేలు జరుగుతుంది. ముడి పామాయిల్ (సీపీఓ)పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ఇది వరకే తొలగించారు. వ్యవసాయ ఇన్‌‌‌‌ఫ్రా డెవలప్‌‌మెంట్ సెస్‌‌ను కూడా 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్​డైరెక్ట్​ ట్యాక్సెస్ ​అండ్ ​కస్టమ్స్  ప్రకటించింది. అగ్రి డెవలప్‌‌మెంట్ సెస్,  సోషల్​ వెల్ఫేర్​ సెస్‌‌లను కూడా కలుపుకుంటే ముడి పామాయిల్‌‌పై  దిగుమతి సుంకం  8.25  శాతం నుండి 5.5 శాతానికి తగ్గుతుంది. ముడి పామాయిల్,  ఇతర ముడి చమురులపై  దిగుమతి సుంకం తగ్గింపు సెప్టెంబర్ 30 వరకు.. అంటే ఆరు నెలల పాటు పొడిగించినట్టు  సీబీఐసీ  తెలిపింది.  ఇదిలా ఉంటే శుద్ధి చేసిన పామాయిల్‌‌పై  దిగుమతి సుంకం 13.75 శాతం వసూలు చేస్తారు. గత ఏడాది పొడవునా నూనెల ధరలు మండిపోవడంతో,  ప్రభుత్వం చాలాసార్లు పామాయిల్‌‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఈ విషయమై సాల్వెంట్ ఎక్స్‌‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌‌ఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిబి మెహతా మాట్లాడుతూ ప్రభుత్వం ముడి పామాయిల్​పై అగ్రి సెస్‌‌ను 7.5 శాతం నుండి 5 శాతానికి తగ్గించిందని చెప్పారు. సన్​ఫ్లవర్​, సోయాబీన్​ ఆయిల్​పైనా ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు దిగుమతి సుంకం 5.5 శాతమే ఉంటుందని వివరించారు. ప్రభుత్వం నిర్ణయం తమకు కాస్తే మేలు చేస్తుందని, తగ్గింపు మరింత కావాలని అన్నారు.