ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్లు హైమావతి

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్లు హైమావతి

సిద్దిపేట టౌన్/ మెదక్​ (పెద్దశంకరంపేట), వెలుగు: ప్రజావాణి దరఖాస్తుల్లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిద్దిపేట, మెదక్​ కలెక్టర్లు హైమావతి, రాహుల్ ​రాజ్​ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్, పెద్దశంకరంపేట రైతువేదికల్లో నిర్వహించిన గ్రీవెన్స్​లో వారు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. సిద్దిపేటలో 116 దరఖాస్తులు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. 

మెదక్​లో 86 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. కాగా, ప్రజావాణికి హాజరైన నారాయణఖేడ్​ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి కలెక్టర్​ను కలిసి స్థానిక సమస్యలు చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ..

సిద్దిపేట కలెక్టరేట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్​చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభిస్తారని,  ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కే. హైమావతి ఆఫీసర్లను ఆదేశించారు. గ్రీవెన్స్​ అనంతరం ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె అధికారులతో మాట్లాడారు. 

జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.  

సెలవు కావాలంటే పై అనుమతి తీసుకోవాలి

చేర్యాల, వెలుగు: మెడికల్​ఆఫీసర్​ నుంచి అటెండర్​ వరకు సెలవు పై వెళ్లాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలని, ఎవరికి వారే లీవ్​ లెటర్​ రాసుకుని సెలవులు తీసుకునే వారిని సహించేదిలేదని సిద్దిపేట కలెక్టర్​ కె.హైమావతి హెచ్చరించారు. సోమవారం మద్దూరు మండలంలోని లద్నూర్ పీహెచ్​సీ సెంటర్​ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు. 

అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ మెడికల్ ఆఫీసర్ సెలవుల్లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా అనుమతి తీసుకున్నారా అని డీఎంహెచ్​వోకి ఫోన్ చేసి అడిగారు. ఇష్టానుసారంగా లీవ్ తీసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పీఎచ్ సీలో అపరిశుభ్రంగా ఉండడం చూసి అటెండర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మద్దూరు పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.