సంపాదించినదంతా పంచేస్తా

సంపాదించినదంతా పంచేస్తా
  • భారీగా దానాలు చేస్తున్న క్రిప్టో బిలియనీర్ శామ్ 

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రిప్టో బిలియనీర్లలో ఒకరైన శామ్​ బ్యాంక్​మన్​ ఫ్రైడ్​వయసు చిన్నదే కానీ మనసు మాత్రం చాలా పెద్దది. తన సంపద అంతా.. అంటే 20 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగాన్ని దానం చేయాలని ఈ 30 ఏళ్ల యువకుడు నిర్ణయించుకున్నాడు. ఈ సంపద సృష్టి ఒక రోజులో జరగలేదు. బిట్‌‌‌‌కాయిన్‌‌ ఊపు గమనించిన తర్వాత ఆయన 2019లో తిరిగి క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్​టీఎక్స్​ను మొదలు పెట్టి లాభాల పంట పండిచారు. ఇంత డబ్బు చేతిలో ఉన్నప్పటికీ తనకు దానిపై మోజు లేదని శామ్​ అంటారు. ఇతరులకు వీలైనంత ఎక్కువ సాయపడటం ఆయన పద్ధతి. శామ్,​ తన సంపాదనలో కేవలం ఒక శాతాన్ని మాత్రమే ఉంచుకుంటాడని, అంటే సంవత్సరానికి కేవలం లక్ష డాలర్లు మాత్రమే తీసుకుంటారని బ్లూమ్​బర్గ్​ వార్తాసంస్థ పేర్కొంది. మిగిలిన డబ్బు అంతటినీ వదులుకుంటారు. ‘గివింగ్​ వాట్​​ వి కెన్​’ అనే స్వచ్ఛంద సంస్థలో ఆయన సభ్యుడు. మెజారిటీ సంపాదనను చారిటీ సంస్థలకు ఇస్తారు. రాజకీయ పార్టీలకు కూడా భారీగా విరాళాలు ఇస్తారు. స్టేడియాలకు పేరు పెట్టే హక్కుల కోసం లక్షలాది డాలర్లు ఖర్చు చేస్తారు. కమెడియన్​ లారీ డేవిడ్‌‌తో కలిసి సూపర్ బౌల్ ప్రకటన కోసం  30 మిలియన్​ డాలర్లు ఖర్చుచేశారు.  తనకు యాట్​ వంటి ఖరీదైన పడవలు, విలాసవంతమైన జీవితం అవసరం లేదని శామ్​ తరచూ చెబుతారు. ఒక బీన్​ బ్యాగ్​పై పడుకుంటారు. లగ్జరీ కారుకు బదులు టొయోటా కారులో వెళ్తారు.  

తక్కువ సొమ్మును ఖర్చు పెట్టడం ద్వారా ఎక్కువ మంది జీవితాలను బాగుచేయవచ్చని శామ్​ చిన్ననాటి స్నేహితుడు మ్యాట్​ నాస్​ అన్నారు. ఈ బిలియనీర్​ ఆఫీసు బహమాస్​లో ఉంటుంది. వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసేలా అక్కడి సము5ద్రం సమీపంలో భారీ క్యాంపస్​ను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం బహమాస్​ ఎయిర్​పోర్టు వద్ద ఒకే అంతస్తు గల భవనంలో ఎఫ్​టీఎక్స్​హెడ్​ ఆఫీసు ఉంది. ఇక క్రిప్టో ఫ్యూచర్స్​, స్వాప్స్​, ఆప్షన్స్​ సేవలను కూడా అందించాలని ఆయన భావిస్తున్నారు. ఇవన్నీ సక్సెస్​ అయితే మెయిన్​స్ట్రీమ్​ ఫైనాన్స్​ ఇండస్ట్రీవైపు కూడా వెళ్తానని శామ్​ బ్యాంక్​మన్​ ఫ్రైడ్​ చెబుతున్నారు.