CSK vs KKR: రవీంద్రుడి స్పిన్ మాయాజాలం.. కోల్‌క‌తా బ్యాటర్ల కుదేలు

CSK vs KKR: రవీంద్రుడి స్పిన్ మాయాజాలం.. కోల్‌క‌తా బ్యాటర్ల కుదేలు

సొంతగడ్డపై చెన్నై సూప‌ర్ కింగ్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ప్రత్యర్థి జట్టులో విధ్వంసకర బ్యాటర్లున్నా.. ఖంగుతినిపించారు. చెపాక్ వేదిక‌గా సీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. సూప‌ర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే 3 వికెట్ల చొప్పున, ముస్తాఫిజర్ రెహ్మాన్ 2 వికెట్లు తీసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తాను తుషార్ దేశ్‌పాండే ఆదిలోనే దెబ్బకొట్టాడు ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్(0)ను ఔట్ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో అంగ్క్రిష్ రఘువంశీ(24; 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), సునీల్ నరైన్(27; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టారు. దీంతో కేకేఆర్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. 

ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని జడేజా విడగొట్టాడు. 7వ తొలి బంతికే రఘువంశీని, అదే ఓవర్ ఆఖరి బంతికి ప్రమాదకర నరైన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఆపై తన తదుపరి ఓవర్‌లో వెంకటేష్ అయ్యర్(3)ను ఔట్ చేసి కోల్‌క‌తాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. అక్కడినుంచి కోల్‌క‌తా కోలుకోలేక పోయింది. చివరలో శ్రేయాస్ అయ్యర్(34; 32 బంతుల్లో), రింకూ సింగ్(9; 14 బంతుల్లో), ఆండ్రీ రస్సెల్(10; 10 బంతుల్లో) వేగంగా పరుగులు చేద్దామనుకున్నా సాధ్యమవ్వలేదు. దేశ్‌పాండే, ముస్తాఫిజర్ రెహ్మాన్ ద్వయం స్లో బాల్స్‌తో ఇబ్బంది పెట్టారు. దీంతో కేకేఆర్ కనీసం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించలేకపోయింది.