ఆయిల్ స్టోరేజీపై పిడుగు..మరోవైపు అమెరికా ఆంక్షలు..

ఆయిల్ స్టోరేజీపై పిడుగు..మరోవైపు అమెరికా ఆంక్షలు..

హవానా: ప్రధాన ఆయిల్ స్టోరేజీపై పిడుగుపాటు.. దాని తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్​ సరఫరాకు ఆటంకం..మరోవైపు అమెరికా ఆంక్షలు కలిసి మొత్తంగా క్యూబా తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. శుక్రవారం క్యూబా రాజధాని హవానాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మతంజాస్​లోని ఆయిల్​ స్టోరేజీ సెంటర్​పై పిడుగుపడింది. దాని ప్రభావంతో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న ఇతర ఆయిల్​ స్టోరేజీ యూనిట్లకు పాకాయి. దీని వల్ల ఆ దేశ చమురు నిల్వల్లో 40%  అగ్నికి ఆహుతయ్యాయి. మతంజాస్ పోర్టులోని 4 ట్యాంకులు మాడిమసైపోయాయి. మంటలను అదుపు చేసేందుకు మెక్సికో, వెనిజులా నుంచి ఫైర్​ సిబ్బందిని, హెలికాప్టర్లు, ఫైర్ బోట్లను రప్పించారు. మంగళవారం నాటికి పరిస్థితులు కాస్త చక్కబడినా.. ఇప్పటికే వేల క్యూబిక్​ అడుగుల చమురు మంటలకు ఆహుతైపోయింది. ఇప్పటి వరకు ఒకరు చనిపోగా.. 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

అమెరికా ఆంక్షలకు తోడు..

అమెరికా ఆంక్షల కారణంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దివాలా అంచులకు చేరుకుంది. దీనికి తోడు తాజాగా పిడుగుపాటు ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. క్యూబా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్​ను దెబ్బతీసింది. కోలుకోవడానికి ఆ దేశానికి కొన్నేండ్లు పట్టొచ్చని నిపుణుల అంచనా. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పాడుతోంది. ఇది మరిన్ని రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 63 ఏండ్ల క్రితం క్యూబా రివల్యూషన్​ నాటి పరిస్థితులు ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు.