సాగు చేసుకుంటున్న భూమిని గుంజుకున్నరు

సాగు చేసుకుంటున్న భూమిని గుంజుకున్నరు
  • బాధితుడి ఆత్మహత్యాయత్నం
  • క్రీడా మైదానం కోసం తీసుకున్న ఆఫీసర్లు 
  • చదును చేసేందుకు రాగా అడ్డుకున్న కుటుంబసభ్యులు
  • పురుగుల మందు తాగిన  శ్రీనివాస్​

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం క్రీడా మైదానం కోసం బలవంతంగా గుంజుకుందని ఆరోపిస్తూ ఓ బాధితుడు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ కు చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు గ్రామ శివారులో 451 సర్వే నంబర్​లో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో శ్రీనివాస్ కుటుంబసభ్యులు 70 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. గ్రామానికి పక్కనే ఉన్న మల్కాపూర్ శివారులో క్రీడా మైదానానికి స్థలం లేకపోవడంతో శివారులో ఉన్న శ్రీనివాస్ పొలంలో ఏర్పాటు చేసేందుకు అర ఎకరం భూమిని అధికారులు గుర్తించారు.

కాగా మల్కాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు కొందరు టీఆర్ఎస్ లీడర్లు కావాలనే తమ భూమిని క్రీడామైదానం కోసం కేటాయించి రెవెన్యూ అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించారని బాధితుడు ఆరోపించాడు. భూమిని ఆదివారం చదును చేసేందుకు అధికారులు రాగా, బాధిత కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ సంఘటనా స్థలంలోనే పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. పేదల భూములను ప్రభుత్వ అవసరాలకు స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మైసగల్లా బుచ్చేంద్ర ప్రశ్నించారు. దళితుల భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.