ఎల్లంపల్లి  ప్రాజెక్ట్​ పరిహారం  కోసం ఎదురుచూపులు

ఎల్లంపల్లి  ప్రాజెక్ట్​ పరిహారం  కోసం ఎదురుచూపులు

మంచిర్యాల, వెలుగు:  ఎల్లంపల్లి ప్రాజెక్టు  కోసం సాగుభూములు, ఇండ్లు  త్యాగం చేసిన భూనిర్వాసితులు   15 ఏండ్ల నుంచి పరిహారం కోసం  ఎదురు చూస్తున్నారు.   న్యాయం చేయాలని  లీడర్ల, అధికారుల చుట్టూ కాళ్లు  అరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం  లేదు.  ఇప్పటికే పలుమార్లు గ్రామాల్లో, కలెక్టరేట్​ వద్ద ఆందోళనలు  నిర్వహించారు.  

నిర్వాసిత కుటుంబాలు 4 వేలకు పైనే

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో హాజీపూర్​ మండలం గుడిపేట, నంనూర్​, చందనాపూర్​, రాపల్లి, పడ్తనపల్లి, కర్ణమామిడి, కొండాపూర్​తో పాటు లక్సెట్టిపేట మండలంలోని సూరారం, గుల్లకోట గ్రామాలు మునిగిపోయాయి. తొమ్మిది గ్రామాలతో పాటు ఆరు వేల ఎకరాలకు పైగా భూములు ముంపునకు గురయ్యాయి.   నాలుగు వేలకు పైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. వీరికి ఆర్​అండ్​ఆర్​ కాలనీల్లో ఇండ్లు కట్టుకునేందుకు ప్లాట్లు కేటాయించారు. ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటి సాయం కింద రూ.70 వేల  ఆర్థికసాయం అందిస్తామని అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించింది. టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్న వారితో పాటు మిగతా వాళ్లకు సైతం రూ.70వేల చొప్పున అందిస్తామని 2017లో ప్రభుత్వం జీవో రిలీజ్​ చేసింది. 

ఇందిరమ్మ ఇల్లు పైసలు కొందరికే...  

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఇందిరమ్మ ఇంటి పైసల కోసం అర్హత గల భూనిర్వాసితులు దరఖాస్తు చేసుకున్నారు. వాటి పరిశీలనతోనే ఏడాదికిపైగా కాలం గడిచిపోయింది.  చివరకు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం 3,440 మందికి రూ.70వేల చొప్పున రూ.24.80 కోట్లు రిలీజ్​ చేసింది. మరో 880 మందికి సంబంధించిన దరఖాస్తులను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. పరిశీలనలు, అభ్యంతరాలు, అడ్డంకులను దాటి ఈ ఫైల్​ ముందుకు కదిలింది. ఇది ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ దగ్గర పెండింగ్​లో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీరికి రూ.6.16 కోట్లు రావాల్సి ఉంది. అలాగే మరో 1,100 మందికి రూ.7.70 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు దరఖాస్తులు కూడా తీసుకోలేదు. 2004 డిసెంబర్​లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2006 నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. 2008లో నిర్మాణం ప్రారంభమై 2013లో పూర్తయింది. అప్పటినుంచి భూనిర్వాసితులకు విడతల వారిగా పరిహారం చెల్లిస్తున్నారు. 15 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే 
ఉన్నారు. 

నిర్వాసితులందరికీ  పరిహారం చెల్లించాలి 

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్​ పరిహారం డబ్బులు వెంటనే  చెల్లించాలి.  అప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులను తిప్పలు పెడుతోంది.  ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నడిపెల్లి దివాకర్​రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న  కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు కమీషన్లు దండుకుని నిర్వాసితులకు అన్యాయం చేశారు.   పెండింగ్​లో ఉన్న నష్టపరిహారం వెంటనే చెల్లించకుంటే నిర్వాసితుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తాం.    

బీజేపీ జిల్లా అధ్యక్షుడు 
వెరబెల్లి రఘునాథ్​రావు