ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • కుటుంబ సమేతంగా కలెక్టరేట్​ ముందు గిరిజనుల ధర్నా

మెదక్, వెలుగు: ఏండ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను అక్రమంగా గుంజుకున్నారని, అక్రమ పద్ధతుల్లో రికార్డుల్లో పేర్లు మార్చుకున్నారని ఆరోపిస్తూ టేక్మాల్​ మండలం సంగ్యా తండా, కడిలబాయి తండా, రోడ్డు తండా గిరిజనులు సోమవారం మెదక్ కలెక్టరేట్​ వద్ద ఆందోళన చేశారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు ఇక్కడే ఉంటామంటూ భార్యాపిల్లలు, తల్లిదండ్రులతోపాటు, గొర్లు, మేకలు, వంట సామగ్రితో కలెక్టరేట్ కు తరలివచ్చారు. తండావాసులు మాట్లాడుతూ తాము ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములు ధరణిలో ఇతరుల పేర్లమీదికి పట్టా అయ్యాయని, వారు ఆ భూమి తమదేనంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. భూసమస్యలపై రెవెన్యూ ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది సివిల్​ మ్యాటర్​ మీరే పరిష్కరించుకోవాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆయా సర్వే నంబర్లలోని భూములపై ఎంక్వైరీ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​కు వినతి పత్రం ఇచ్చారు. ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. 

భూ సమస్యలు పరిష్కరించండి

ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు

సిద్ధిపేట రూరల్, వెలుగు: భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని పలువురు రైతులు సిద్దిపేట కలెక్టర్​ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ను కోరారు. సోమవారం ఐడీవోసీ మీటింగ్​హాల్​లో ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందజేసిన అర్జీలను అడిషనల్​కలెక్టర్లు ముజమిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి స్వీకరించారు.  ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల్లో ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్​, డబుల్​బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్ల సమస్యలే ఎక్కువగా వచ్చాయి. మొత్తం 38 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్వో చెన్నయ్య,  కలెక్టరేట్ ఏవో రెహమాన్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఆఫీస్​లో.. 

సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్​లో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు.  టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, హరితహారం విభాగాలకు సంబంధించి ప్రజల నుంచి ఆరు దరఖాస్తులను స్వీకరించారు.

గ్రూప్–1 ఎగ్జామ్​సజావుగా నిర్వహించాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఈ నెల 16న గ్రూప్–1 ఎగ్జామ్​ను ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​  డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఎస్పీ రమణ కుమార్ తో కలిసి గ్రూప్-1 ఎగ్జామ్​ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులతో రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8,654 మంది అభ్యర్థులు ఎగ్జామ్​రాస్తున్నారని, వారికి 26 ఎగ్జామ్​సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 

చెరువులో పడి వ్యక్తి మృతి

దుబ్బాక, వెలుగు: ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. సోమవారం దుబ్బాక మండలం చిట్టాపూర్​ గ్రామానికి చెందిన ఎలగారి స్వామి గౌడ్​(53) కాలకృత్యాల కోసం చెరువులోకి వెళ్లాడు. కాలు జారడంతో చెరువులో పడ్డాడు. అతనికి ఈత రాకపోవడంతో చనిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

కోహేడ (హుస్నాబాద్), వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ డివిజన్ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరై మాట్లాడారు. ఇప్పటికే హుస్నాబాద్ లో జర్నలిస్టులకు 40 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. కొహెడ, చిగురుమామిడి మండలాలకు చెందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీకి ప్రాసెస్ నడుస్తోందన్నారు. దళిత జర్నలిస్టులకు దళిత బంధులో ప్రాధాన్యమిస్తామన్నారు. అనంతరం జర్నలిస్టు సంఘం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పిట్టల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా చల్ల రాజు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ పర్సన్ రజిత, వైస్ చైర్మన్ అనిత, ఎంపీపీ మానస, జడ్పీటీసీ మంగ, ప్రసాద రావు పాల్గొన్నారు.

తహసీల్​ ఆఫీస్​లకు వీఆర్ఏల తాళాలు

మెదక్ (శివ్వంపేట), వెలుగు: తమ డిమాండ్​ల సాధనకు సమ్మె చేస్తున్న వీఆర్ఏలు సోమవారం తహసీల్దార్​ఆఫీసులకు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఆఫీసర్లు, స్టాఫ్​ డ్యూటీకి వెళ్లకుండా అడ్డున్నారు. శివ్వంపేట తహసీల్దార్ ఆఫీస్​ను దిగ్బంధించి 12 గంటల వరకు ధర్నా కొనసాగించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో  వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు, మండల అధ్యక్షుడు బాలయ్య, వీఆర్ఏలు  తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్,వెలుగు: కొండపూర్​తహసీల్దార్ ఆఫీసును వీఆర్ఏలు ముట్టడించి దిగ్బంధం చేశారు. వీఆర్ఏల జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల్ ప్రెసిడెంట్ శ్రీశైలం మాట్లాడుతూ సర్కార్ కండ్లు తెరిచి వీఆర్ఏ సమస్యలపైన చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

నారాయణ్ ఖేడ్,వెలుగు: నారాయణఖేడ్ ఎమ్మార్వో ఆఫీస్ కి తాళం వేసి  వీఆర్ఏలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఖేడ్ జేఏసీ అధ్యక్షుడు ఖాజా మియా, వీఆర్ఏలు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల ధర్నా 

సిద్దిపేట రూరల్, వెలుగు: తమ సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, పరిష్కారం కావడం లేదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవధ్యక్షుడు జి.భాస్కర్ అన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట కలెక్టరేట్​ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సాయులు, వెంకటేశ్వర్లు, మల్లేశం, యాదగిరి, మల్లికార్జున్, వివిద మండలాల దివ్యాంగులు పాల్గొన్నారు.

ఏడాదైనా రోడ్డేయరా..!

గుంతల్లో మొక్కలు నాటి నిరసన

మెదక్ (నిజాంపేట), వెలుగు: రోడ్డు పనుల్లో ఆలస్యాన్ని నిరసిస్తూ సోమవారం సీఐటీయూ నాయకులు రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మొక్కలు నాటి నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడుతూ నిజాంపేట నుంచి నస్కల్ గ్రామం వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా మారిందని, బీటీ కోసం రూ.9 కోట్లు మంజూరై ఏడాదవుతున్నా పనులు చేపట్టలేదని ఆరోపించారు. రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు, విద్యార్థులు,  రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్, ప్రవీణ్, నవీన్, ప్రకాష్  పాల్గొన్నారు.

టీఆర్ఎస్​కు వీఆర్ఎస్ ​టైం వచ్చింది

నర్సాపూర్, వెలుగు: టీఆర్ఎస్​కు వీఆర్ఎస్​ ఇచ్చే టైం వచ్చిందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ లీడర్​ మురళీ యాదవ్ అన్నారు. సోమవారం నర్సాపూర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9న నర్సాపూర్​లో జరిగిన బీజేపీ సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ లీడర్లు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, అడ్డంకులు సృష్టించినా ప్రజలు కదిలి వచ్చి సక్సెస్ చేశారన్నారు. 8 ఏండ్ల నిరంకుశ పాలనపై విసుగు చెందిన ప్రజలు కేసీఆర్​కు చరమగీతం పాడే రోజులు ముందున్నాయన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రిగా చేసినవారు  నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బుచ్చేశ్​ యాదవ్, రాజేందర్, సునీత, లీడర్లు పాల్గొన్నారు.

సబ్బండ కులాల పోరాటంతోనే స్వరాజ్యం 

సిద్దిపేట రూరల్ (నారాయణరావుపేట), వెలుగు: సబ్బండ కులాల పోరాటంతోనే స్వరాజ్యం సాధించవచ్చని  దళిత్ శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్ మహరాజ్ అన్నారు. సోమవారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్, బంజేరుపల్లి, కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో స్వరాజ్యపాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ జెండా గద్దెలను విశారదన్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వాటా ఎంతో ప్రశ్నించేందుకే స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర  కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు రవి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్, బుగ్గ రాజు, యాదగిరి, రాజేష్, భిక్షపతి పాల్గొన్నారు.

పీఎస్ఆర్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలయ్ బలయ్

మునిపల్లి, వెలుగు: దసరా సందర్భంగా పీఎస్ఆర్ ఆధ్వర్యంలో మునిపల్లి మండలంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.  సోమవారం పోల్కంపల్లి, ఖమ్మంపల్లి గ్రామాల శివారులో జరిగిన ఈ కార్యక్రమాన్ని జడ్పీ చైర్​పర్సన్​ మంజుశ్రీ, మునిపల్లి జడ్పీటీసీ పైతర మీనాక్షి, పీఎస్ఆర్  ఫౌండేషన్ చైర్మన్​సాయికుమార్​ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్​పర్సన్​మంజూశ్రీ, అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ​మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణలో పండుగలకు గుర్తింపు వచ్చిందన్నారు. అనంతరం అలయ్ బలయ్  కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు జడ్పీటీసీ మీనాక్షి మెమెంటోలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జడ్పీటీసీలు స్వప్న, అపర్ణ,  సుప్రజ, కుమార్ గౌడ్, రాజు రాథోడ్, రమేశ్, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేశం, టీఆర్ఎస్​మండలాధ్యక్షుడు సతీశ్​కుమార్, ఎంపీటీసీ లక్ష్మి, మైనార్టీ మండల అధ్యక్షుడు  మౌలానా  తదితరులు పాల్గొన్నారు.

పురావస్తు శాఖతో సర్వే చేయించండి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: కంది మండలం బ్యాతోల్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి నిర్మాణాలున్నాయని, వాటిని పురావస్తు అధికారులతో సర్వే చేయించాలని విశ్వహిందూ పరిషత్ లీడర్లు సోమవారం గ్రీవెన్స్​డేలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా లకు వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ద్వారా రవి మాట్లాడుతూ  కాకతీయుల కాలం నాటి నిర్మాణాల్లో ఏటా దసరాకు భగవత్ ధ్వజం ఎగురేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈసారి భగవత్ ధ్వజం ఎగురవేసేందుకు సిద్ధం కాగా అధికారులు ఆ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందిగా పేర్కొంటూ కాషాయ జెండాలు తొలగించడంతో పాటు గ్రామపెద్దలపై కేసులు నమోదు చేశారన్నారు. ఆ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  

గీత కార్మికులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలె

నారాయణ్ ఖేడ్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఫెడరేషన్​ఏర్పాటుచేసి రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. ఖేడ్ లో సోమవారం కల్లుగీత కార్మికుల జిల్లా రెండో మహాసభను నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు నారాయణఖేడ్​లోని ఆర్టీఓ ఆఫీస్​నుంచి బసవేశ్వర చౌక్ వరకు గీత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రమణ మాట్లాడుతూ సంఘం పోరాటాల ద్వారా చెట్టు పన్ను రద్దు, ఐదేండ్ల లైసెన్సును పదేండ్లకు పెంచుకోగలిగామని గుర్తు చేశారు. 

బీజేపీ మీటింగ్ కు పోతే..

పోలీసులు కొట్టారని ఎస్పీకి ఫిర్యాదు

మెదక్, వెలుగు: నర్సాపూర్​లో ఆదివారం జరిగిన బీజేపీ సభకు పోతే అక్కడి పోలీసులు తనను అకారణంగా కొట్టారని కౌడిపల్లి మండలం దేవులపల్లికి చెందిన జింక వెంకటేశం అనే వ్యక్తి సోమవారం గ్రీవెన్స్​లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ గ్రామం నుంచి 20 మంది మీటింగ్​ కు వెళ్లామని, మీటింగ్​ అనంతరం పార్టీ ముఖ్య నాయకులకు శాలువా కప్పేందుకు స్టేజీ మీదకు ఎక్కగా సీఐ, ఎస్సైలు తనను కిందకు తోసేశారన్నారు. తర్వాత ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆరోపించారు. విచారణ జరిపి తనను అకారణంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ల్యాండ్ పూలింగ్ సర్వే చేయొద్దు 

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని.. ఆ భూమిలో సర్వే చేయొద్దని ఇస్లాంపూర్ గ్రామస్థులు అధికారులను కోరారు. సోమవారం ఇస్లాంపూర్ రైతులు తూప్రాన్ ఆర్డీవో ఆఫీస్ లో డీఏవో ఆనంద్ బాబుకు  వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో ఎలాంటి మీటింగ్ ఏర్పాటు చేయకుండా, సమాచారం ఇవ్వకుండా అధికారులు సర్వే చేయడం సరికాదన్నారు. ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

భూములు కబ్జాచేసి కేసులు పెట్టించారు 

మెదక్ (శివ్వంపేట), వెలుగు: అధికార పార్టీ లీడర్​ తమ భూములు కబ్జా చేసిందేకాక, కేసులు పెట్టించి ఇబ్బందుల పాల్జేశాడని దళిత రైతులు ఆరోపించారు. శివ్వంపేట మండలం కొంతాన్​పల్లికి చెందిన దళిత రైతులు, సర్పంచ్​ శ్రీనివాస్, టీఆర్ఎస్​ నాయకుడు కరుణాకర్​ రెడ్డితో కలిసి సోమవారం తహసీల్దార్​ ఆఫీస్​కు వచ్చారు. తమకున్న 32 ఎకరాల భూమిని కబ్జా చేశారని అసైన్డ్​భూమిని గ్రామానికి చెందిన అధికార పార్టీ  లీడర్​ తహసీల్దార్​కు ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా తాము కాస్తులో ఉన్న భూమిలో పంటలు సాగు చేసేందుకు వెళ్లగా సదరు లీడర్​ 12 మంది పై కేసు పెట్టించి జైలుకు పంపించారన్నారు.